ఆంధ్రుల‌కు మిగిలింది మ‌ట్టి.. నీళ్లే

Update: 2015-10-22 10:12 GMT
ఎంత‌గానో ఎదురు చూసిన అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం పూర్తి అయ్యింది. అనుకున్న‌ట్లే.. అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని చారిత్ర‌కంగా నిర్వ‌హించ‌టంలో ఏపీ స‌ర్కారు విజ‌య‌వంత‌మైంద‌నే చెప్పాలి.

ఇక‌.. రాజ‌ధాని శంకుస్థాప‌న సంద‌ర్భంగా ప్ర‌ధాని ఇచ్చే హామీల మీద ఏపీ ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. ఎలాంటి హామీ ఇవ్వ‌ని మోడీ.. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌తి ఒక్క అంశాన్ని పూర్తి చేస్తామ‌న్న మాట మాత్రం ఇచ్చారు. ప్ర‌త్యేక హోదా అంశం విభ‌జ‌న చ‌ట్టంలో లేని విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అంతేకాదు.. రాజ‌ధాని నిర్మాణానికి ఎంత మొత్తం ఇవ్వొచ్చ‌న్న అంశం మీద కూడా విభ‌జ‌న చ‌ట్టంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విష‌యాలు ప్ర‌ధాని మోడీకి తెలియ‌నివి కాదు. కానీ.. ఇచ్చేందుకు ఇష్టం లేక‌పోతే.. మాట‌లు మాత్ర‌మే చెబుతార‌న్న దానికి త‌గ్గ‌ట్లే శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో మోడీ తీరు ఇలానే ఉంది.

పార్ల‌మెంటు భ‌వ‌నం నుంచి పుట్ట మ‌ట్టి తీసుకొచ్చాన‌ని.. ప‌విత్ర యమునా జ‌లం తీసుకొచ్చానంటూ రెండు పాత్ర‌ల్ని స్టేజ్ మీద ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు చూస్తుండ‌గా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి ఇచ్చిన మోడీ.. చివ‌ర‌కు తాను ఇచ్చేది అనేద‌నన్న విష‌యాన్ని తేల్చి చెప్పేశారు. పెళ్లికి.. పేరంటానికి పిలిస్తే ఉత్త చేతుల‌తో వెళ్ల‌కూడ‌ద‌న్న మాట‌ను గుర్తు పెట్టుకొని కాసింత మ‌ట్టి.. కాసింత నీళ్లు తీసుకొచ్చేసి ఏపీ సీఎం చేతికి ఇచ్చేసి చ‌క్కా పోయిన మోడీ తీరు చూస్తే.. ఏపీ ప్ర‌జ‌ల‌కు మోడీ ఇచ్చింది రెండు కుండ‌ల్లో మ‌ట్టి.. నీళ్లు మాత్ర‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News