29 నెలల తర్వాత మోడీ వచ్చుడేంది?

Update: 2016-07-09 04:30 GMT
తరచూ విదేశీ పర్యటనలు చేసే ప్రధాని నరేంద్రమోడీ వ్యవహారం కాస్త చిత్రంగా ఉంటుంది. తాను వెళ్లే దేశాల్ని గతంలో భారత ప్రధాని ఎప్పుడు సందర్శించారు? అన్న విషయాన్ని ఆసక్తికరమైన రీతిలో వార్తలు వచ్చేలా ప్రకటనలు జారీ చేస్తుంటారు. తాజాగా ఆయన చేస్తున్న ఆఫ్రికా ఖండంలోని వివిద దేశాల పర్యటనల సందర్భాన్ని పురస్కరించుకొని.. ఒక దేశాన్ని గడిచిన 30 ఏళ్లలో ఏ భారత ప్రధాని సందర్శించలేదని.. మరో దేశాన్ని గడిచిన దశాబ్దంలో ఏ ప్రధాని వెళ్లలేదంటూ ఇలా.. ఏ దేశానికి ఆ దేశానికి సంబంధించిన డేటాను వార్తగా ఇచ్చేశారు. ఇదంతా చూసినోళ్లు.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల వ్యవధిలోనే ఇన్నేసి దేశాలు తిరుగుతూ జాతి జెండాను విదేశాల్లో ఎంత ఘనంగా ఆవిష్కరిస్తున్నారో అన్న భావనకు గురి అవుతుంటారు.

అక్కడెక్కడో ఉన్న విదేశాల్ని అన్నేసి సంవత్సరాల తర్వాత వెళుతున్న ప్రధానిగా మోడీ పరివారం గొప్పలు ప్రచారం చేసుకుంటున్న వేళ.. దేశంలోనే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఆయన ఎందుకు పర్యటించరన్నది అర్థం కానిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. ప్రభుత్వం కొలువుతీరి 25 నెలలు పూర్తి కావొస్తున్నా.. ఇప్పటివరకూ ఆయన తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది లేదు. ఎందుకలా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పరు.

ఎక్కడో మారుమూలన ఉన్న విదేశాలకు సైతం వెళుతున్న ప్రధాని మోడీ.. ఢిల్లీకి గంట కంటే తక్కువ ప్రయాణం ఉన్న తెలంగాణకు వచ్చి పోవటానికి 25 నెలల్లో ఒక్కసారి కూడా కుదర్లేదా? తాజాగా బీజేపీ నేతలు చెబుతున్న దాని ప్రకారం.. మోడీ అక్టోబరులో తెలంగాణలో పర్యటిస్తారని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమనుకుంటే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు తీరిన 29 నెలలకు కానీ మోడీ వచ్చేందుకు కుదరలేదన్న మాట. విదేశాలకు వెళ్లటం తప్పని చెప్పలేం కానీ.. స్వదేశంలోని రాష్ట్రాల్ని ఇన్నేసి నెలలుగా ఎందుకు పర్యటించనట్లు? అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెబితే బాగుంటుంది. విదేశీ పర్యటన గురించి గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు.. దేశంలోని ఒక కొత్త రాష్ట్రంలో పర్యటించటానికి మోడీ దాదాపు 29 నెలల సమయం ఎందుకు తీసుకున్నారో కారణం చెబుతారా..?
Tags:    

Similar News