అలా చేసేందుకే క‌శ్మీర్‌ లో మిత్రుడికి క‌టీఫ్‌?

Update: 2018-06-20 05:06 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌హా అయితే ప‌ది నెల‌లు.. మ‌రికాస్త క‌చ్ఛితంగా చెప్పాలంటేఆరేడు నెల‌లు కూడా లేవ‌ని చెప్పాలి. ద‌స‌రా ముగిసిందా?  సార్వ‌త్రిక ఫీవ‌ర్ దేశంలో వ‌చ్చేసిన‌ట్లే. మ‌రి.. ముంగిట్లోకి సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌స్తున్న వేళ‌.. మిత్ర‌ప‌క్షంతో క‌లిసి అధికారాన్ని పంచుకుంటున్న రాష్ట్రంలో ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌టం చేస్తారా?  వీలైతే బ‌లాన్ని అంత‌కంత‌కూ పెంచుకుంటారే కానీ ఇలా తుంచుకుంటారా? అన్న ప్ర‌శ్న‌లు క‌శ్మీర్ ఎపిసోడ్ ను చూస్తున్న కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే.. క‌శ్మీర్‌ లో మోహ‌బూబా ముఫ్తీ స‌ర్కారుతో క‌టీఫ్ వెనుక భారీ ప్లానింగ్ ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఈ అంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో దేశ వ్యాప్తంగా మోడీ వ్య‌తిరేక ప‌వ‌నాలు బ‌లంగా వీస్తున్న‌ట్లుగా ప‌లు స‌ర్వేలు.. ఇటీవ‌ల వెల్ల‌డైన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే.. ఇట్టే అర్థ‌మ‌వుతాయి. తాజాగా ఒక ముఖ్య‌మంత్రి చెప్పిన‌ట్లుగా.. అధికారం కోసం మోడీ ఏమైనా చేస్తార‌న్న దానికి త‌గ్గ‌ట్లే.. త‌న ప్ర‌భ అంత‌కంత‌కూ కొడి గ‌డుతున్న వేళ‌.. మోడీ చూస్తూ ఊరుకోరు క‌దా?

ఒక్కో రాష్ట్రంలో త‌మ మిత్ర‌ప‌క్షాలు అంత‌కంత‌కూ దూర‌వుతున్న వేళ‌.. దేశ వ్యాప్తంగా ప్ర‌భావితం చేసేలా భారీ ప్లానింగ్ చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే క‌శ్మీరులో మిత్రుడితో క‌టీఫ్ చెప్పిన‌ట్లుగా అంచ‌నా వేస్తున్నారు. యావ‌ద్దేశాన్ని ఒక్క‌తాటి మీద ఉంచేలా చేసే సెంటిమెంట్ల‌లో జ‌మ్ముక‌శ్మీర్ అంశం ఒక‌టి. రంజాన్ సంద‌ర్భంగా కాల్పుల విర‌మ‌ణ‌ను మాట‌ల్లో చెప్పిన‌ట్లే తూచా త‌ప్ప‌కుండా చేత‌ల్లో చూపించినందుకు భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వ‌చ్చింది.

మీడియా అధినేత హ‌త్య‌తో పాటు.. భార‌త జ‌వాను ఔరంగ‌జేబును కోల్పోవాల్సి వ‌చ్చింది. ఈ రెండు ప‌రిణామాలు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం కావ‌టంతో పాటు.. క‌శ్మీరులో ముష్క‌రుల‌కు దిమ్మ దిరిగేలా షాకివ్వ‌టం.. క‌శ్మీరు చీకాకుకి కార‌ణ‌మైన పాక్ సంగ‌తి చూడాల‌న్న ఆవేశ‌పు వ్యాఖ్య‌లు ప‌లువురి నోట వినిపిస్తున్నాయి. ఇదే త‌గిన స‌మ‌యంగా భావిస్తున్న మోడీ స‌ర్కారు తొలుత క‌శ్మీర్ లో త‌న మిత్ర‌ప‌క్షంలోని ప్ర‌భుత్వానికి గుడ్ బై చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌లోకి రాష్ట్రాన్ని తీసుకురావ‌టం ద్వారా.. ఏమైనా చేసేందుకు వీలుగా ఫ్లాట్ ఫాం సిద్ధం చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో పాక్ తో  ప‌రిమిత యుద్ధాన్ని చేసేలా మోడీ ప్లాన్ చేస్తున్నారా? అన్న అంశంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను పోగొట్టుకోవ‌టానికి క‌శ్మీర్‌ కు మించిన అస్త్రం మోడీకి మ‌రొక‌టి లేద‌ని చెప్పాలి. క‌శ్మీర్ లో త‌ర‌చూ వేలెడుతూ చికాకు పెట్టే దాయాది పాక్ పై ప‌రిమిత మోతాదులో యుద్ధం చేయ‌టం ద్వారా.. ఆ దేశానికి షాకివ్వ‌టం.. ఆ వార్ తో క‌శ్మీర్ వ్యాలీలో శాంతితో పాటు.. క‌శ్మీరు కోసం ఎంత‌కైనా వెళ‌తామ‌న్న సందేశాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌టం ద్వారా.. దేశ వ్యాప్తంగా మోడీ మొన‌గాడు భ‌య్ అన్న భావ‌న క‌లుగ‌జేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారన్న వాద‌న వినిపిస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే ఈ మ‌ధ్య‌న ఆయుధాల్ని సిద్ధం చేసుకోవ‌టం క‌నిపిస్తోంది. ఇందుకోసం భారీ ఆర్డ‌ర్ ఇవ్వ‌టాన‌ని చూస్తున్నారు. సార్వ‌త్రికం ముంచుకొస్తున్న వేళ‌.. స‌రిహ‌ద్దుల్లో వార్ చేయ‌టం ద్వారా దాయాదిపై అధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించి.. కేంద్రంలో మ‌రోసారి కొలువు తీరేలా బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ప్లానింగ్ చేస్తుంద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి.. ఇందులో నిజం ఎంత‌న్న‌ది క‌దిలే కాల‌మే క‌న్ఫ‌ర్మ్ చేయాలి.
Tags:    

Similar News