మోడీ నోటివెంట టాలీవుడ్!

Update: 2019-08-09 11:47 GMT
దేశంలో ఇప్పుడు హిందీ చిత్రపరిశ్రమ నంబర్ 1. మరి నంబర్ 2 ఏంటి.? అనాదిగా ఉన్న ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన తమిళ చిత్ర పరిశ్రమనేనా? కొన్నేళ్ల కిందటి వరకు తమిళమే నంబర్ 2 పొజిషన్ లో ఉండేది. కానీ మన తేట తెలుగు దర్శకులు, రచయితలు మెదడును కరిగించి  గర్వించే సినిమాలు రూపొందిస్తున్న వేళ ఇప్పుడు కోలీవుడ్ ఏంటి బాలీవుడ్ కూడా మనవైపే చూస్తోంది.

బాహుబలి లాంటి గొప్పచిత్రాన్ని టాలీవుడ్ దేశానికి అందించింది. ఈ సినిమా ప్రభంజనానికి బాలీవుడ్ , కోలీవుడ్ బేజారెత్తింది. ఈ ఒక్క సినిమా దేశంలో తెలుగు సినిమా స్టామినాను దేశానికి పరిచయం చేసిందంటే అతిశయోక్తి కాదు.. స్వయంగా ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ కూడా.. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అంటూ ప్రశ్నించాడంటే బాహుబలి ఖ్యాతిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి సహా చాలా తెలుగు సినిమాలు హిందీలో రిమేక్ అవ్వడంతో టాలీవుడ్ ఖ్యాతీ ఇనుమడించింది. ఇలా కోలీవుడ్ ను మించి టాలీవుడ్ హిందీ సినిమాపై తనదైన ముద్ర వేసింది.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కశ్మీర్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఇదే అర్థమవుతోంది. కశ్మీర్ ను భూతల స్వర్గంగా మారుస్తామని.. అక్కడ స్టూడియోలు నిర్మిస్తామని.. సినిమాలు నిర్మించుకునేలా చేస్తామని.. అద్భుత లోకేషన్లు ఉన్న కశ్మీరాన్ని వాడుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా హిందీ, తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు కశ్మీర్ లో సినిమా తీయాలంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర నోటివెంట పిలుపు అందింది. అంతే బాలీవుడ్ తర్వాత స్థానం టాలీవుడ్ దేనని తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. తెలుగు సినిమా ఖ్యాతీ పెరిగిందనడానికి ప్రధాని మోడీ పిలుపే కారణమంటున్నారు.
    

Tags:    

Similar News