ఉన్న విషయాన్ని సూటిగా అడిగేస్తూ మోడీ సంచలనం

Update: 2020-09-27 04:10 GMT
ప్రపంచ జనాభాలో 18 శాతం ఒక్క భారత్ లోనే ఉంది. అన్నింటికి మించి ఇరుగుపొరుగు దేశాలతో స్నేహంగా ఉండాలని.. ఒక ఇంట్లోనూ.. ఒకరి కంట్లోనూ వేలు పెట్టాలన్న అభిలాష ఏ మాత్రం లేని దేశంగా భారత్ కు ఉన్న పేరు అంతాఇంతా కాదు. అయినప్పటికీ.. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్విత సభ్యత్వానికి భారత్ ఎందుకు దూరంగా ఉండాలి? దశాబ్దాల తరబడి ఈ డిమాండ్ ను అలానే మగ్గుతుందే తప్పించి.. ఎలాంటి ప్రయోజనం లేని వైనంపై గట్టిగా నిలదీయాలని.. సభ్య దేశాల్ని ప్రశ్నించాలన్న కోరిక తాజాగా నెరవేరింది.

ప్రధాని నరేంద్ర మోడీ.. ఐక్యరాజ్యసమితిలో శాశ్విత సభ్య దేశంగా ఉండే విషయంలో దేశానికున్న అర్హతల్ని ప్రస్తావించటమే కాదు.. ఇంతకాలం తమను శాశ్విత దేశంగా గుర్తించే విషయంలో చోటు చేసుకుంటున్న ఆలస్యాన్ని తీవ్రస్వరంగా ప్రశ్నించటమే కాదు.. సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చేసిందన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. ఐక్యరాజ్యసమితి 75 ఏళ్లు అవుతున్న వేళ.. సర్వప్రతినిధి సభను ఉద్దేశించి శనివారం వీడియో కాన్ఫరెన్సు లో మాట్లాడిన ఆయన.. నిజాల్ని చాలా నిష్ఠూరంగా వెల్లడించటమే కాదు. . రోటీన్ కు భిన్నంగా సంస్థ లోటుపాట్లను విశ్లేషించే సాహసానికి తెర తీశారు. ఇంతకూ మోడీ ఏం మాట్లాడారు అన్నవిషయంలోకి వెళితే..

‘‘ ప్రపంచదేశాలకు ఓ ముఖ్యమైన ప్రశ్న. 1945లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను రూపొందించారు. పరిస్థితులు చాలా మారాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నాటి చార్టర్‌ ఉందా? సమితి చాలా విజయాలే సాధించింది.. కాదనను. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా సమితి దోహదపడింది. కానీ అదేసమయంలో  ఎన్ని యుద్ధాలు, ఎన్నెన్ని అంతర్యుద్ధాలు, ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయన్నది .. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే తెలుస్తుంది’’

‘‘లక్షల ప్రాణాలు పోయాయి. సామాన్యుల రక్తం ఏరులై ప్రవహించింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎందరో శరణార్థులుగా మిగిలారు. ఈ సమస్యల్ని పరిష్కరిస్తున్నామా? ప్రస్తుతం కావాల్సినది సంస్కరణలు. ఇవి ఎప్పటికైనా చోటు చేసుకుంటాయా? అని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం’’

‘‘వందలాది భాషలు.. యాసలు.. సిద్ధాంతాలు.. సంస్కృతులకు నెలవు. వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలో మగ్గింది. మేం బలంగా ఉన్నప్పుడు ప్రపంచానికి ముప్పు కాలేదు. అదే సమయంలో మేం బలహీనంగా ఉన్నప్పుడు ప్రపంచానికి భారంగానూ మారలేదు. మా దేశంలో చోటు చేసుకుంటున్న మార్పులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న వేళ.. మేం భద్రతామండలిలో శాశ్విత సభ్యత్వానికి ఎందుకు ఎదురుచూడాలి?’’

‘‘ఐక్యరాజ్యసమితిది మాది ఒకటే భావన. ప్రపంచమంతా వసుధైక కుటుంబంగా ఉండాలని కోరుకుంటాం. ఎన్నో దేశాలకు శాంతి పరిరక్షక దళాల్ని పంపాం. ఆ క్రమంలో వందలాది సైనికుల్ని కోల్పోయాం. శాంతి మా లక్ష్యం. అందుకు శ్రమించాం. ఇంత సేవ చేసినందుకు సమితిలో మరింత భాగస్వామ్యం భారతదేశానికి ఉండాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు’’
Tags:    

Similar News