స్మైల్ ప్లీజ్‌...మోడీ కొత్త ప‌థ‌కం!

Update: 2016-04-28 07:41 GMT
ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్‌ డీఏ ప్రభుత్వం మ‌రో కొత్త ప్ర‌చారానికి సిద్ధం చేసింది. కేంద్రంలో మోడీ స‌ర్కారు ఏర్పడి మే 26 నాటికి రెండేళ్లు పూర్తవబోతున్న సందర్భంగా ఆ పార్టీ ఆర్భాట ప్రచారానికి రంగం సిద్ధమైంది. ప్రచార ఎత్తుగడల్లో సిద్ధహస్తులైన బీజేపీ అగ్రనేతలు ఈ సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ముఖ్యాంశాలపై కసరత్తు చేశారు. రెండేళ్ల కాలంలో ప్ర‌వేవ‌పెట్టిన ప్ర‌ధాన‌మంత్రి జన్‌ ధన్‌ యోజన - దీనదయాళ్‌ గ్రామ జ్యోతి యోజన - ఎల్‌ పీజీ 'గివ్‌ ఇట్‌ అప్‌' - పంటల బీమా పథకం - డిజిటల్‌ ఇండియా - స్వచ్ఛ భారత్‌ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ప్రచారంలో ఉపయోగించుకోనున్నారని తెలిసింది.

ఈ ప్ర‌చారం సందర్భంగా నిర్వహించబోయే ప్రచార కార్యక్రమానికి ట్యాగ్‌ లైన్‌ గా 'స్మైల్‌ ప్లీజ్‌' అని నిర్ణయించడం విశేషం. పీఐబీ - దూరదర్శన్‌ - ఆకాశవాణిల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం సాగించాలని కమలనాథులు నిర్ణయించారు. ఇందుకోసం ఈ పథకాలకు సంబంధించిన వివరాలు అందజేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించారు. ప్రాథ‌మిక వివ‌రాల ప్ర‌కారం 'గివ్‌ ఇట్‌ అప్‌'లో భాగంగా కోటి మందికి పైగా గ్యాస్‌ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్నారు. దీనితో గ్రామీణ పేదలకు ప్రభుత్వం ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తోంది.

గ్రామీణ విద్యుదీకరణ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 7 వేల గ్రామాలకు కరెంటు కనెక్షన్‌ ఇచ్చారని, జన్‌ ధన్‌ యోజనలో భాగంగా 21.3 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారని... ఇంకా ఇలాంటి గణాంకాలతో మోడీ ప్రభుత్వం రెండో వార్షికోత్సవ ప్రచారానికి తెరతీయబోతోంది. ఈ సందర్భంగా ఎంపీలందరూ తమ తమ నియోజకవర్గాల్లో కేంద్రీకరించాలని, మంత్రులు కనీసం రెండు నియోజకవర్గాలను కవర్‌ చేయాలని నిర్ణయించారు.
Tags:    

Similar News