కేబినెట్‌ ను మోదీ మ‌రోసారి విస్త‌రిస్తారా?

Update: 2017-09-03 12:14 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి తన మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలోకి కొత్తగా 9 మందికి చోటు కల్పించారు. ఇప్పటివరకు సహాయ మంత్రులుగా ఉన్న నలుగురు సీనియర్‌ మంత్రులకు పదోన్నతి కల్పించి కేబినెట్‌ హోదా ఇచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా అనేక సమీకరణాలతో కొత్త కేబినెట్ కొలువుదీరింది. అయితే సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వ్యవధి ఉండటంతో మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే మోదీ తీరుపై గుర్రుగా ఉన్న ఎన్డీఏ మిత్రపక్షం శివసేన తన వైఖరిని బాహాటంగానే వెల్లడించింది. ఇటీవలే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరిన జేడీయూదీ పైకి చెప్పకున్నా ఇదే పరిస్థితి. ఇంకా తమిళనాట ఆశలపల్లకీలో విహరించిన అన్నాడీఎంకేకి కేబినెట్లో చోటు దక్కలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు రాజీనామా చేసినా వారి స్థానంలో ఎవరికీ అవకాశమివ్వలేదు.  

తాజా విస్తరణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కొన్ని రోజులుగా ఆసక్తి రేపుతున్న కేంద్ర కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణపై సస్పెన్స్‌ నెలకొంది. నాలుగైదు రోజులుగా మంత్రి పదవులపై జరుగుతున్న చర్చకు తెరదించుతూ 9 మంది కొత్తవారికి అవకాశం ఇస్తూ ప్రధాని మోదీ - బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది హిమాచల్‌ ప్రదేశ్ - గుజరాత్ - కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు - 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరిగింది. తాజా విస్తరణకు ప్రధాన మంత్రి నాలుగు ‘పీ’ (అభిరుచి (ప్యాషన్‌) - సామర్థ్యం (ప్రొఫిషియన్సీ) - నైపుణ్యత (ప్రొఫెషనలిజం) - రాజకీయ చతురత (పొలిటికల్‌ అక్యుమెన్‌)) ఫార్ములా ఆధారంగానే ఈ జాబితాను రూపొందించినట్లు భావిస్తున్నారు.

2018 ముగిసే సరికి గుజరాత్‌ - హిమాచల్‌ ప్రదేశ్‌ - మధ్యప్రదేశ్‌ - రాజస్థాన్‌ - చత్తీస్‌ గఢ్‌ - కర్ణాటక.. తదితర రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు ఎంపీలు ఎక్కువగా ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌ తో పాటు బిహార్‌పై భాజపా కేంద్ర నాయకత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. నలుగురు సహాయమంత్రులకు కేబినెట్‌ హోదా కల్పించడంతో పాటు కొత్తగా తొమ్మిదిమందికి స్థానం కల్పించారు. స్వతంత్ర హోదాలో ఉన్న నలుగురు మంచి పనితీరు కనపరచడంతో వారికి కేబినెట్‌ హోదా ఇచ్చారు.

కేంద్ర మంత్రి పునర్వ్యవస్థీకరణపై శివసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త కేబినెట్‌ లో మిత్రపక్షం శివసేనకు ప్రధాని మోదీ మొండిచేయి చూపారు. అయితే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి గైర్హాజరైన ఆ పార్టీ.. మేం ఎవరినీ ఏం అడుక్కోం.. ఆ పరిస్థితి మాకు అక్కర్లేదని వ్యాఖ్యలు చేసింది. నయా కేబినెట్‌ లో ప్లేస్ కన్‌ ఫర్మ్‌ అని ఊహాగానాలు వచ్చినా.. మరో మిత్ర పక్షం జేడీ(యూ)కు కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. రెండు స్థానాలు ఖాయమని రామ్‌ నాథ్ ఠాకూర్‌ - ఆర్‌ సీపీ సింగ్‌ లకు బెర్తులు దక్కవచ్చని భావించినా.. చివరి నిమిషంలో వారి పేర్లు చేర్చేలేదు. మంత్రి వర్గ విస్తరణపై మీడియా ద్వారానే సమాచారం తెలిసిందని ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్ వ్యాఖ్యానించటం కొసమెరుపు. మరోవైపు నాలుగో విస్తరణలో జేడీయూతోపాటు అన్నాడీఎంకేకు చోటుదక్కలేదు.

ఇక రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్‌ లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులో ఇద్దరు రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వెంకయ్యనాయుడు గత కేబినెట్‌ లో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడంతో వెంకయ్య స్థానంలో విశాఖ ఎంపీ హరిబాబుకు అవకాశం కల్పిస్తారని భావించారు. అయితే తుది జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఈ సారి ఏపీకి కేబినెట్‌ లో చోటు దక్కలేదు. ఇదే తరహాలో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో కార్మికశాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న బండారు దత్తాత్రేయను.. అనూహ్యంగా రాజీనామా కోరడంతో ఆయన స్థానంలో మురళీధరరావు లేదా మరొకరికి ఛాన్స్ దక్కుతుందని భావించారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రెండు రాష్ట్రాలకూ తాజా విస్తరణలో చోటు కల్పించలేదు.

ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు మరోసారి విస్తరణ జరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో గరిష్ఠంగా 81 మంది మంత్రులను నియమించుకోవచ్చు. ప్రస్తుతం ప్రధానితో కలిపి కేంద్ర మంత్రుల సంఖ్య 76. గతంలో 73 మందికి గాను.. ఆరుగురు మంత్రులు రాజీనామా చేయటంతో ఈ సంఖ్య 67కు చేరింది. ఆదివారం 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో.. కేంద్ర కేబినెట్‌ సంఖ్య 76కు చేరుతుంది. అంటే మరో ఐదుగురిని మంత్రులుగా నియమించే అవకాశం ఉంది.
Tags:    

Similar News