రంగంలోకి మోడీ.. మ‌రి బీజేపీ నేత‌లు ఏం చేస్తారు?

Update: 2021-12-15 16:30 GMT
సాధార‌ణంగా రాష్ట్రాల స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ఎవ‌రైనా ప్ర‌ధాన మంత్రి వ‌ద్ద‌కు వెళ్తుంటారు. కుదిరితే.. త‌న‌కు వీలుంటే.. ప్ర‌ధాని అప్పాయింట్మెంటు ల‌భిస్తుంది. లేక‌పోతే.. వెయింటింగు.. లేదా తిరుగు ట‌పాలో రాష్ట్రానికి వ‌స్తున్నారు. ఇటీవ‌ల తెలంగాణ, గ‌తంలో ఏపీకి చెందిన చాలా మంది నాయ‌కుల‌కు ఇదే ప‌రిస్థితి ఎదురైంది. అది కూడా బీజేపీ నేత‌లు కావ‌డం గ‌మ‌నార్హం.  దీంతో వీరు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు వేదిక లేకుండా పోయింద‌నే వాద‌న స‌ర్వ‌త్రా వినిపించింది. అయితే.. ఇప్పుడు నేరుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. దిగివ‌స్తున్నారు. రంగంలోకి దిగుతున్నారు. `మీ స‌మ‌స్య‌లు చెప్పండి..`` అని అడుగుతున్నారు. అది కూడా బీజేపీ నేత‌లు, ఎంపీల‌తోనే ఆయ‌న స్వ‌యంగా మాట్లాడ‌నున్నారు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారు వీరు..? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది.

త్వ‌ర‌లోనే ప్ర‌ధాని మోడీ దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల బీజేపీ కీల‌క నేత‌లు, ఎంపీలతో భేటీ అవబోతున్నారు. తెలంగాణా, ఏపీ, కర్నాటక రాష్ట్రాల ఎంపీలు, ముఖ్యనేతలకు మోడీ బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, ఏపీలో బీజేపీ బ‌లోపేతం పై ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు. అదే స‌మ‌యంలో పార్టీ ప‌రిస్థితి, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అనుస‌రించాల్సిన వ్యూహం వంటివి కూడా చ‌ర్చ‌ల్లో ప్ర‌ధానంగా రానున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నేత‌ల‌తో మోడీ భేటీ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి. భేటీ అయితే జరుగుతుంది కానీ అందులో ఎంపీలు, ముఖ్యనేతలు వాస్తవ పరిస్థితులను మోడీకి వివరిస్తారా ? అన్నదే అసలైన ప్రశ్న.

ఏపీ, తెలంగాణ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. చిత్ర‌మైన విష‌యాలు క‌నిపిస్తున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 8 సంవ‌త్స‌రాలు పూర్తయి నా.. ఇప్ప‌టి వ‌ర‌కు విభ‌జ‌న హామీలు నెర‌వేర‌లేదు.   ప్రత్యేక హోదా, వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు లాంటి అనేక హామీలు ఇప్ప‌టికి పెండింగులో నే ఉన్నాయి. వీటిల్లో చాలా హామీలను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతే తుంగలో తొక్కారు. 2014 ఎన్నికల ప్రచారంలో హోదా, రైల్వే జోన్ లాంటి హామీలను ప్రస్తావించిన మోడీ తర్వాత వాటిని పూర్తిగా ప‌క్క‌న పెట్టారు.

ఈ నేప‌థ్యంలో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కానీ.. ఇప్పుడు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కానీ.. కేంద్రంలోని మోడీ స‌ర్కారును ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తులు చేస్తూనే ఉన్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు..  ఏకంగా వైరం పెట్టుకున్నారు. అయితే.. ఇంత జ‌రిగినా.. మోడీ మౌనంగానే ఉంటున్నారు. ఇక‌, ఇప్పుడు.. ఏకంగా బీజేపీ నేత‌ల‌తోనే ఆయ‌న భేటీ అవుతున్న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న ఏపీ బీజేపీ నాయ‌కులు.. మ‌రి ఈ విష‌యాల‌పై ఆయ‌న‌తో చ‌ర్చిస్తారా? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న ప్ర‌శ్న‌. బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు, కీల‌క నేత‌లు పురందేశ్వరి, సత్యమూర్తి, కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పుతారా? అనేది చూడాలి.
Tags:    

Similar News