ఆ ఫోన్ కాల్ తోనే ఖ‌ర్చుకు కోత పెట్టారా?

Update: 2015-10-16 11:52 GMT
అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని భావిస్తున్న ఏపీ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి సంబంధించి ఒక స్ప‌ష్ట‌మైన మార్పు గ‌త నాలుగు రోజులుగా క‌నిపిస్తోంది. ఏదైనా కార్య‌క్ర‌మానికి సంబంధించి ఎంత గ్రాండ్‌గా చేస్తున్నామ‌నే అంశాన్ని త‌ప్పించి.. ఖ‌ర్చు ప‌ట్టించుకోని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న వైఖ‌రికి భిన్నంగా ఖ‌ర్చుల గురించి ప‌దే ప‌దే మాట్లాడుతున్నారు.

ఒక్క చంద్ర‌బాబు మాత్ర‌మే కాదు.. మంత్రులు కూడా ఖ‌ర్చుల గురించి వివ‌ర‌ణ ఇచ్చేట‌ట్లు మాట్లాడుతున్నారు. నిజానికి ఖ‌ర్చు చేయ‌టం ఇదే తొలిసారా? అంటే అదేమీ లేదు. హైద‌రాబాద్ లోని సెక్ర‌టేరియ‌ల్ లో త‌న చాంబ‌ర్ నిర్మాణం కోసం దాదాపు రూ.10కోట్ల‌కు పైనే ఖ‌ర్చు చేశారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయినా.. ఎవ‌రూ స్పందించింది లేదు.

గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా పెట్టిన ఖ‌ర్చు విష‌యంలోనూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అప్పుడు కూడా ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌ది లేదు. వివ‌ర‌ణ ఇచ్చింది లేదు. అలాంటిది.. ఎప్పుడూ లేని విధంగా రాజ‌ధాని శంకుస్థాప‌న విష‌యంలో మాత్రం ఖ‌ర్చు ఎంత పెడుతున్న విష‌యాన్ని కూడా మంత్రులు ప‌దే ప‌దే చెబుతున్నారు. శంకుస్థాప‌న కోసం రూ.400కోట్లు ఏపీ స‌ర్కారు ఖ‌ర్చు చేస్తుంద‌ని చెబితే.. రూ.10కోట్లకు ఖ‌ర్చు మించ‌ద‌ని చెబుతూ.. ఇప్ప‌టివ‌ర‌కూ రూ.9కోట్ల వ‌ర‌కు మాత్ర‌మే నిధులు విడుద‌ల చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇక‌.. విమానాలు మొద‌లు ఏర్పాట్లు మొత్తం కూడా వీవీఐపీలు ఎవ‌రికి వారు ఖ‌ర్చు పెట్టుకుంటున్నార‌ని కేవ‌లం తాము విమానాలు నిలిపేందుకు మాత్ర‌మే సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు. మ‌రి.. ఇదంతా ఎందుకు జ‌రుగుతుంది? దీని వెనుక ఏదైనా క‌థ ఉందా? అన్న‌ది సందేహంగా మారింది. అయితే.. రాజ‌కీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఖ‌ర్చు గురించి ప‌దే ప‌దే మాట్లాడ‌టం.. తాము చాలా త‌క్కువ ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్ప‌టానికి కార‌ణం ప్ర‌ధాని మోడీ అని చెబుతున్నారు. ఆయ‌న ఆఫీసు నుంచి వ‌చ్చిన ఫోన్ కాల్ తోనే ప‌రిస్థితి మొత్తం మారిపోయింద‌న్న మాట వినిపిస్తోంది.

ఇప్ప‌టికే భూమిపూజ జ‌రిపిన దానికి శంకుస్థాప‌న చేప‌ట్టేందుకు ఇంత భారీ ఖ‌ర్చు ఎందుక‌ని ప్ర‌శ్నించ‌టంతో పాటు.. భారీత‌నానికి పోతే.. ప్ర‌ధాన‌మంత్రి రాక మీద కూడా నీలినీడ‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌టమే ఖ‌ర్చుల గురించి త‌మ్ముళ్లు ప‌దేప‌దే మాట్లాడుతున్న‌ట్లుగా టాక్ న‌డుస్తోంది. జ‌పాన్‌.. సింగ‌పూర్ ప్ర‌ధానులు రాక‌పోవ‌టానికి కూడా ప్రోటోకాల్ పాటించే విష‌యంలో అనుస‌రించాల్సిన ప‌ద్ధ‌తుల్ని చంద్ర‌బాబు స‌ర్కారు పాటించ‌క‌పోవ‌ట‌మే కార‌ణంగా చెబుతున్నారు. ఖ‌ర్చు విష‌యంలో విమ‌ర్శ‌లు త‌లెత్త‌కుండా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న ప్ర‌ధాని మోడీ మాట‌తో వెన‌క్కి త‌గ్గుతున్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News