బాబు - పవన్ అడ్రెస్ గల్లంతేనట

Update: 2019-04-08 04:06 GMT
ప్రముఖ సినీ నటుడు - వైసీపీ నేత మంచు మోహన్ బాబు... ఆదివారం నాటి ప్రచారంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం తన సొంత జిల్లా చిత్తూరుకు వచ్చిన ఆయన తిరుపతిలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అటు టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు రాజకీయ జీవితానికి త్వరలోనే శుభం కార్డు పడనుందని ఆయన కామెంట్ చేశారు. ఈ  ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్ కానున్నారని కూడా ఆయన మరో సంచలన వ్యాఖ్య చేశారు. చంద్రబాబుకు సంబంధించి తన వద్ద  పుస్తకం ఉందని చెప్పిన మోహన్ బాబు... ఆ పుస్తకాన్ని బయటపెడితే... పరిస్థితులు వేరేగా ఉంటాయని కూడా హెచ్చరించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ విషయాన్ని ప్రస్తావించిన మోహన్ బాబు... చంద్రబాబు మాదిరే పవన్ కూడా త్వరలోనే ఏపీ రాజకీయాల నుంచి అడ్రెస్ లేకుండా పోతారని జోస్యం చెప్పారు.

ఈ ఎన్నికల్లో ఒంటరిగానే జనసేన పోటీ చేస్తోందని ప్రకటించిన పవన్... టీడీపీ వద్ద డబ్బు తీసుకుని సైలెంట్ అయిపోయారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ఆడుతున్న డ్రామాలకు కాపులు మరోమారు మోసపోవడానికి సిద్ధంగా లేరని కూడా మోహన్ బాబు మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి బరిలో రెండు పార్టీలే ఉన్నాయని చెప్పిన మోహన్ బాబు... అసలు జనసేన ఎక్కడుందని కూడా ప్రశ్నించారు. ఎన్నికలు ముగియగానే జనసేన ఎక్కడా కనిపించదని మోహన్ బాబు సంచలన కామెంట్ చేశారు.

Tags:    

Similar News