డ్రెస్‌ పేరు చెప్పి..లేడీ టీచ‌ర్‌ ను తొల‌గించార‌ట‌!

Update: 2018-02-07 12:33 GMT
టాలీవుడ్ విల‌క్ష‌న న‌టుడు మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుంది. త‌మ సొంత జిల్లా చిత్తూరుకు చెందిన తిరుప‌తికి స‌మీపంలో మంచు ఫ్యామిలీ శ్రీ‌విద్యానికేతన్ పేరిట విద్యా సంస్థ‌ల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలుత తిరుప‌తిలోనే విద్యానికేత‌న్‌ ను ఏర్పాటు చేసినా... కాల‌క్ర‌మంలో మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు విష్ణు దాని బాధ్య‌త‌లు చేపట్టిన త‌ర్వాత హైద‌రాబాదులోనూ ఓ శాఖ‌ను ఏర్పాటు చేశారు. విద్యా బోధ‌న‌లో ఈ సంస్థ‌కు ఎన‌లేని గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌న పాఠశాల‌లో చేరిన ప్ర‌తి చిన్నారిని త‌న సొంత కుటుంబానికి చెందిన వారిగానే చూస్తామ‌ని - మంచి భ‌విష్య‌త్తుకు పునాది వేస్తామ‌ని మోహ‌న్ బాబు చెప్పే మాట‌లు నిజంగానే ఆ పాఠ‌శాల కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెంచాయ‌నే చెప్పాలి. ఇప్ప‌టిదాకా ఈ విద్యా సంస్థ‌కు సంబంధించి చిన్న వివాదం కూడా లేద‌నే చెప్పాలి. అయితే ఉన్న‌ట్టుండి ఇప్పుడు విద్యానికేతన్ ఓ పెద్ద వివాదంలోనే చిక్కుకుంది. ఈ విద్యా సంస్థ‌లో ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తున్న ఓ యువ‌తి ఏకంగా మంచు ఫ్యామిలీపై న్యాయ పోరాటానికే దిగేసింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం తెలుగు నేల‌లో హాట్ టాపిక్‌ గా మారిపోయింద‌ని చెప్పాలి.

అస‌లు ఈ వివాదం వివ‌రాల్లోకెళితే... శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్‌ పై రాణి రవడ(43) అనే మహిళా టీచర్ ను యాజ‌మాన్యం తొల‌గించింది. కేవలం తన దుస్తుల్ని కారణంగా చూపించి ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరో టీచర్ కూడా అలాంటి దుస్తులే వేసుకొస్తున్నా.. కావాలని తనను మాత్రమే స్కూల్ నుంచి తప్పించారని న్యాయ‌పోరాటానికి దిగింది. ఫార్మల్ ప్యాంట్ - లాంగ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుని స్కూల్‌ కు వచ్చిందన్న కారణంతో రాణి రవడను శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తొలగించింది. గత డిసెంబర్ 7న పాఠశాల యాజమాన్యం ఆమెకు తొలగింపు ఉత్తర్వులను ఇచ్చింది. శ్రీ విద్యానికేతన్ నియామవళికి విరుద్దంగా రాణి రవడ టీచర్ క్లాజ్ 11 - 13లను ఉల్లంఘించిందని యాజమాన్యం ఆరోపిస్తోంది. సకాలంలో సిలబస్ కూడా పూర్తి చేయలేదని ఆరోపించింది. స్కూల్ ప్రమాణాలకు విరుద్దంగా వస్త్రధారణ ఉండటం వల్లే ఆమెను తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే బాధితురాలి వాద‌న ఇంకోలా ఉంది. గతేడాది సెప్టెంబర్ 4న తాను శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరినట్లు టీచర్ రాణి తెలిపారు. సిలబస్ పూర్తి చేయలేదన్న ఆరోపణలు తనను తొలగించడం కోసం సృష్టించినవే అన్నారు. అమర్యాదకరంగా తనను తొలగించారని పేర్కొన్నారు. రాత పూర్వక ఆదేశాలు ఇవ్వక ముందే స్కూల్ చైర్మన్ తనను ఇలాంటి దుస్తులు వేసుకోవద్దని ఆదేశించారని రాణి తెలిపారు. వేరే జాతీయత కలిగిన మరో టీచర్ అలాంటి వస్త్రధారణతోనే స్కూల్ కు వస్తున్నారని, కేవలం తాను తెలుగు వ్యక్తిని అయినందువల్లే తనను తొలగించారని ఆమె ఆరోపించారు. యాజమాన్యం తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకునేంతవరకు న్యాయపోరాటం చేస్తానని తెలియజేశారు. దీంతో మొత్తంగా ఎన్న‌డూ లేని విధంగా ఇప్పుడు మంచు ఫ్యామిలీ పెద్ద వివాదంలో చిక్కుకున్న‌ట్లుగానే తెలుస్తోంది. మ‌రి ఈ వివాదం నుంచి మంచు ఫ్యామిలీ ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.
Tags:    

Similar News