బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసిన జ‌గ‌న్‌

Update: 2021-12-14 13:30 GMT
ఏపీలో 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికలు జరిగిన అధికార వైసిపి అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, పరిషత్ ఎన్నికలు ఇలా ఏ ఎన్నిక‌ జరిగినా గెలుపు వైసీపీదే. పై నుంచి కింద వరకు వైసిపి ప్రజాప్రతినిధులే కనిపిస్తున్నారు. ప్రతిపక్షాలకు అసలు ఛాన్స్ లేకపోవడంతో అధికార పార్టీ నుంచి ఎంతోమంది సామాన్యులకు సైతం కీలక పదవులు లభిస్తున్నాయి.

ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన మహమ్మద్ కరీమున్నీసా ఎమ్మెల్సీ అయ్యారు. అయితే దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీ అయిన కొద్ది రోజులకే ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సాధారణ మైనార్టీ కుటుంబానికి చెందిన ఆమె కార్పోరేటర్ గా పనిచేశారు.  కృష్ణ - గుంటూరు జిల్లాలో మైనార్టీ వర్గానికి చెందిన ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్న జగన్ క‌రీమున్నీసాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ పదవి వచ్చిన కొద్ది నెలలకే ఆమె మృతి చెందారు.

జగన్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి ఆమె మృత దేహానికి నివాళులు అర్పించారు. ఆమె మృతి తో కాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని జగన్ ఎవరికి ఇస్తారా ? అన్న‌ సస్పెన్స్ ఉంది. అయితే జగన్ ఆ సస్పెన్స్కు తెర దించుతూ మృతిచెందిన క‌రీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడు ఎండీ రుహుల్లాను వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో క‌రీమున్నీసా కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే విజయవాడ నగరంలో ఉన్న ముస్లింలు సైతం జగన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం రుహుల్లా, కార్పొరేటర్ షాహినా సుల్తానాతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ తన జీవితకాలం జగన్మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని... తన తల్లి క‌రీమున్నీసా ఆశ‌యాలు నెరవేర్చ‌డంతో పాటు మైనార్టీల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని చెప్పారు.
Tags:    

Similar News