వినాయ‌క చ‌వితికి ముస్లింల ప్ర‌చారం..అదిరింది!

Update: 2017-08-24 12:52 GMT
తెల్ల‌వారితే.. భాద్ర‌ప‌ద శుద్ధ చ‌వితి. ప్ర‌తి హిందువులూ.. ఎంతో సంప్ర‌దాయ బ‌ద్ధంగా చేసుకునే వినాయ‌క చ‌వితి వ‌చ్చేసింది. ప్ర‌తి ఇంట్లోనూ వారి వారి ఆర్థిక ప‌రిస్థితిని బ‌ట్టి బొజ్జ  గ‌ణ‌పతి విగ్ర‌హాన్నిఏర్పాటు చేసి.. అర్చించుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఈ విగ్ర‌హాల ఏర్పాటుపైనే గ‌త కొన్నేళ్లుగా అనేక చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. విగ్ర‌హాల త‌యారీకి వినియోగించే రంగులు - ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్ వంటివి ప‌ర్యావ‌ర‌ణానికి ముఖ్యంగా నీళ్లు క‌లుషితం అవుతాయ‌ని, జ‌ల‌చ‌రాల‌కు ఎంతో హాని క‌లుగుతుంద‌ని దేశ‌వ్యాప్తంగా పర్యావ‌ర‌ణ ప్రేమికులు స‌హా నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు కూడా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, ఈ సూచ‌న‌లను పాటించేవారూ ఉన్నారు. పాటించ‌నివారూ ఉన్నారు.

అయితే, సామాజిక స్పృహ‌, అంత‌కంటే ఎక్కువ సామాజిక బాధ్య‌త, అంత‌కు మించి ప‌ర్యావ‌ర‌ణంపై ప్రేమ ఉన్న ముస్లిం దంపతులు గ‌ణేశ్ పండుగ‌ను తాము చేసుకోక‌పోయినా.. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించ‌ని విధంగా దీనిని జ‌రుపుకోవాల‌ని, ముఖ్యంగా మ‌ట్టిగ‌ణ‌ప‌తే మ‌హాగ‌ణ‌ప‌తి అని పెద్ద ఎత్తున వినూత్నంగా గ‌తంలో ఎవ్వ‌రూ చేయ‌ని విధంగా ప్ర‌చారం చేస్తున్నారు.  తెలంగాణ‌లోని మ‌హ‌బూబాబాద్‌కి చెందిన ఈ దంప‌తులు గ‌త కొన్నేళ్లుగా ఈ వినూత్న సామాజిక చైతన్య ప్ర‌చారం చేస్తున్నా.. తాజాగా మాత్రం దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారంలోకి వ‌చ్చారు. ప్ర‌స్తుతం వీరి ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

మ‌హ‌బూబాబాద్‌ కి చెందిన మ‌హ్మ‌ద్ సుభానీ - స‌లీమాలు దంప‌తులు. వీరికి సామాజిక అంశాల‌పై ప‌ట్టు ఉంది. స‌మాజంలో జ‌రుగుతున్న చెడును అంత‌మొందించాల‌ని ప‌ట్టుద‌ల కూడా ఉంది. అందుకే వీరిద్ద‌రూ త‌మ‌దైన శైలిలో స‌మాజాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.  2013 నుంచి వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను కాకుండా మ‌ట్టి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించాల‌ని వినూత్న రీతిలో ప్ర‌చారం చేస్తున్నారు. సుభాన్ ధోతి ధ‌రించి, చొక్కా లేకుండా, శ‌రీరం మొత్తం మ‌ట్టి పులుముకుని, మ‌ట్టి వినాయ‌కుడి ఆకారంలో చేసిన త‌ల‌ను ధ‌రించి రిక్షా మీద గ‌ణ‌ప‌తి లాగా కూర్చుంటాడు.

ఆ రిక్షాను స‌లీమా వీధుల గుండా తోసుకుంటూ వెళ్తూ మ‌ట్టి వినాయ‌కుడి ప్రాముఖ్య‌త‌ను వివ‌రిస్తుంటుంది. వీరు ప్రతి ఏడాది వినాయ‌క చ‌వితికి ఇలాగే వినూత్న రీతిలో మ‌ట్టి వినాయ‌కుల‌ను ప్ర‌తిష్టించాల‌ని ప్ర‌చారం చేస్తుంటారు.  వీరి ప్ర‌చారానికి ప్ర‌తి ఒక్క‌రూ క‌దిలిపోతారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వీరి ప్ర‌చారానికి అబ్బుర‌ప‌డ్డారు. ముస్లిం దంప‌తుల‌ను మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. వీళ్ల గురించి తెలియ‌జేస్తూ ఆయ‌న ట్వీట్ చేశారు. మీకు నోబెల్ ఇచ్చినా త‌క్కువే అంటూ చేసిన ఈ కామెంట్ చాలు .. వారిలో ఎంత సామాజిక స్పృహ ఉందో తెలియ‌జేయ‌డానికి.
Tags:    

Similar News