ఎల్లుండే ఫాంహౌస్ కేసు తీర్పు.. ఉత్కంఠ.. ఏం జరుగనుంది?

Update: 2023-02-04 15:00 GMT
తెలంగాణలో సంచలనం సృష్టించిన మెయినాబాద్ ఫాం హౌస్ కేసు సీబీఐకి అప్పగించే తీర్పు ఈనెల 6న వెలువడనుంది. ఈ కేసును సీబీఐ విచారణ జరిపించాలని కేసులో ఉన్న నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సీబీఐకి అనుమతినిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ ఉత్తర్వులపై అప్పీల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లింది. ఇరు వాదనలు విన్న హైకోర్టు ఈ తీర్పును 6న వెలువడనున్నట్లు శుక్రవారం తెలిపింది. అదే రోజు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దీంతో ఫాం హౌజ్ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారన్న అభియోగంలో రాష్ట్రం ప్రభుత్వం విచారణకు సిట్ ను ఆదేశించింది. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపించారు.

అయితే తమను కావాలనే కేసులో ఇరికించారని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిందితులు కోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్ ను యాక్సెప్ట్ చేసిన హైకోర్టు సిబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా సిట్ దర్యాప్తును రద్దు చేసి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ ఉత్తర్వుులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు డివిజన్ బెంజ్ ను ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ తో పాటు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన డివిజన్ బెంజ్ ఇంతకాలం దీనిని రిజర్వులో ఉంచింది. అయితే తాజాగా శుక్రవారం మాత్రం దీనిపై ఈనెల 6న తీర్పు వెలవడేలా హైకోర్టు లిస్టింగ్ లో పెట్టింది.

ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తున్నారన్న అభియోగంలో విచారణ చేపట్టిన సిట్ నిందితులపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం ఏసీబీ కోర్టు తప్పుబట్టింది. అంతేకాకుండా మరికొంతమంది నిందితులను ఇందులో చేర్చాలని చూసిన సిట్ వినతిని తోసి పుచ్చింది. అంతకుముందు సిట్ దర్యాప్తు చేసిన తరువాత ఫరీదాబాద్కు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్ కు చెందిన నంద కుమార్, తిరుపతికి చెందిన సింహయాజీలను ప్రధాన నిందితులుగా పేర్కొంది. అయితే వారు తమ కేసును సీబీఐ విచారించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇక దీనిపై 6న తీర్పు వెలువడడంతో రాష్ర్ట ప్రభుత్వంలో ఉత్కంఠ నెలకొంది. అటు ఇదే రోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు బడ్జెట్ విషయంలో ఎలాంటి ప్రతిస్పందనలు ఎదురవుతాయోనని అనుకుంటున్న ప్రభుత్వానికి ఇదే రోజు ఫాం హౌజ్ కేసు తీర్పు ఉండడం వీపరీత టెన్షన్ కు దారి తీస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News