సెల్ ఫోన్ ఉంటే సమాధి చేసినా బతికేయొచ్చు

Update: 2017-06-08 09:37 GMT
సెల్ ఫోన్లు మనిషికి ఎన్నిరకాలుగా పనికొస్తున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా రష్యా రాజధాని మాస్కోలో ఓ వ్యక్తి ఏకంగా సమాధి నుంచి బయటపడి ప్రాణం పోసుకోవడంలోనూ సెల్ ఫోన్ సహకరించింది. వినడానికి వింతగా, ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే.
    
మాస్కోకు చెందిన ఖిక్ మెట్ అనే వ్యాపారి తన వ్యాపారం నిమిత్తం చాలామంది దగ్గర అప్పులు చేశాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆయన చేసిన అప్పులు తీర్చలేకపోయారు. దీంతో ఆయనను దొరకబుచ్చుకున్న అప్పుల వాళ్లు చితకబాదారు. అంతటితో ఆగకుండా ఆగ్రహంతో నేలపై పెద్ద గుంత తవ్వి ఆయన్ను సజీవంగా పాతిపెట్టారు. అయితే... ఖిక్ మామూలోడు కాదు.. బుర్ర ఉపయోగించాడు. సమాధిలోంచే ఎలాగో ఒకలా వీలు చేసుకుని తన  తన జేబులోని సెల్ ఫోన్ తీసి తన అన్న ఇస్మాయిల్ కు ఫోన్ చేసి సంగతంతా చెప్పాడు. అయితే... ఎక్కడ సమాధి చేశారో చెప్పకుండానే ఆ ఫోన్ కట్ అయింది. వెంటనే ఇస్మాయిల్ తన తమ్ముడికి అప్పులిచ్చినవారిని కాంటాక్ట్ చేయగా వారు వివరాలు చెప్పడానికి నిరాకరించారు. అప్పు తీరిస్తేనే చెప్తామన్నారు. దాంతో ఇస్మాయిల్ వారికి 1.2 మిలియన్‌ రూబుల్స్‌తో పాటు తన బీఎండబ్ల్యూ 535 మోడల్‌ కారును కూడా అప్పగించి ఎక్కడ సమాధి చేశారో కనుక్కున్నాడు.
    
ఆ వెంటనే ఇస్మాయిల్ హుటాహుటీన అక్కడికి చేరుకుని సమాధిలోంచి తమ్ముడ్ని బయటకు తీశారు. అప్పటికే ఆయన్ను సమాధి చేసి నాలుగు గంటలైనా ఆయన కొన ఊపిరితో ఉన్నాడు. అయితే.. అప్పటికే స్పృహ కోల్పోవడంతో వెంటనే  ఆసుపత్రికి తరలించడంతో బతికి బట్టకట్టాడు.  అయితే... తీవ్రంగా గాయపడిన ఖిక్ కు కొన్ని పక్కటెముకలు విరిగాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News