ఇంపార్టెంటు కేసులపై సుప్రీంలో ఈ రోజే విచారణ

Update: 2017-10-30 07:02 GMT
సుప్రీంకోర్టులో ఈ రోజు అత్యంత కీలకమై కేసులు విచారణకు రానున్నాయి. ముఖ్యంగా ప్రజల జీవితానికి సంబంధించినవి అందులో ఉన్నాయి. ఆధార్ అనుసంధానం నుంచి లవ్ జిహాద్ వరకు పలు కీలక కేసులపై న్యాయమూర్తులు వాదనలు విననున్నారు.
    
జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేసిన ఆధార్ అనుసంధానం కేసును విననుంది. ఆధార్ ను ప్రతి సంక్షేమ పథకానికీ అనుసంధానం చేయడంపై ఆగ్రహంతో ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ కేసు వేశారు.  ఇదే సమయంలో మొబైల్ ఫోన్లకు ఆధార్ ను అనుసంధానం చేయడంపైనా ధర్మాసనం వాదనలు వింటుంది.
    
మరోవైపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ ప్రివిలేజ్ లను కల్పించే రాజ్యాంగంలోని 35 (ఏ) ఆర్టికల్ పై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విననుంది. దేశంలోని మిగతా ప్రజలకు లేని హక్కులు - స్వతంత్ర హోదా కాశ్మీర్ కు అవసరం లేదని ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి.
    
ఈ కేసు తరువాత దీపక్ మిశ్రా బృందం కేరళ లవ్ జీహాద్ కేసునూ విచారించనుంది. ఓ ముస్లిం యువకుడు - హిందూ యువతిని వివాహమాడి, ఆమె మతాన్ని మార్పించిన కేసులో, హైకోర్టు విచారణ తీరును ప్రశ్నించిన మిశ్రా - తిరిగి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. వీటితో పాటు బీసీసీఐలో సంస్కరణల అమలు జరుగుతున్న తీరుతెన్నులనూ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ విచారించనుంది.
    
కాగా మహాత్మా గాంధీ హత్య కేసు పునర్‌ దర్యాప్తు అంశంపైనా ఈ రోజు సుప్రీంలో విచారణకు వచ్చింది. అయితే, ఈ కేసు విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. మహాత్మా గాంధీ మునిమనుమడు తుషార్‌ గాంధీ ఈ కేసు విచారణను వ్యతిరేకిస్తున్నారు.
Tags:    

Similar News