జగన్ స్పీచ్ లో అండర్ లైన్ చేసుకోవాల్సిన అంశాలెన్నో

Update: 2020-11-02 05:15 GMT
ఒక  ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ప్రతిపక్షాలు టార్గెట్ చేయటం మామూలే. కాకుంటే.. అధికార పక్షానికి తక్కువలో తక్కువ రెండేళ్లు సమయం ఇస్తారు. కాదూ కూడదంటే ఏడాది అయితే తప్పనిసరి. ఆర్నెల్లు అస్సలు నోరు విప్పటానికి కూడా ఇష్టపడరు. అందుకు భిన్నంగా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండోరోజు నుంచే బోలెడన్ని ఎత్తులు వేయటమే కాదు.. కాలు కదపటానికి వీల్లేని రీతిలో అడ్డంకుల్ని క్రియేట్ చేయటం కనిపిస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పని చేయకుండా ఎంతలా ఉక్కిరిబిక్కిరి చేయొచ్చన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా జగన్ సర్కారుకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

మొండితనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జగన్.. ఇలాంటి కఠిన పరీక్షల్ని ఎదుర్కోవటమే కాదు.. ధీటుగా రియాక్టు కావటాన్ని చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి. అయినప్పటికీ ఆగకుండా.. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్న వైనంపై తనదైన శైలిలో ఆ విషయాల్ని వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రరాష్ట్ర ఆవతరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో ఆసక్తికర అంశాలెన్నో.

ఆవేశం.. అంతకు మించిన ఆక్రోశం.. కలగలిపి.. ప్రభుత్వం ముందున్న సవాళ్లను ప్రస్తావిస్తూనే.. వాటి కారణంగా ఏపీ పరిస్థితి ఎలా మారిందన్న వేదనను వినిపించారు. అదే సమయంలో.. ఇలాంటి కుయుక్తుల్నితాను ఉపేక్షించనన్న సంకేతాల్ని ఇచ్చారు. గతానికి భిన్నంగా తాజాగా జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడిన మాటల్లో చాలా అంశాల్ని అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. భవిష్యత్తులో తన అడుగులు ఎలా ఉంటాయన్న సందేశాన్ని సంకేతాల రూపంలో ఆయన ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. జగన్ ఏమన్నారు.. అండర్ లైన్ చేసుకొని ఒకటికి రెండుసార్లు చదువుకోవాల్సిన ప్రధానాంశాల్ని చూస్తే..

-  నావారు, కానివారన్న ధోరణులు బాహాటంగా రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. మన కళ్లముందే కనిపిస్తున్న ఈ ధోరణులను సమర్థిద్దామా? ప్రజల తీర్పును, ప్రజాప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ.. వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ మొత్తంగా తెలుగుజాతి ప్రయోజనాలకు వేరుపురుగుగా మారింది. దీనిని ఇలాగే వదిలేద్దామా..?

-  రాష్ట్ర బంగారు భవిష్యత్‌ కోసం ఎందరో త్యాగమూర్తుల ఫలితం ఇది. త్యాగాలతో పాటు భారతదేశంలో ఏ రాష్ట్రమూ పడనంతగా దగాపడిన రాష్ట్రం కూడా మనదే. బయటివారి కత్తిగాట్లు, సొంతవారి వెన్నుపోట్లతో తల్లడిల్లింది.

-  నేటికి 35 శాతం నిరక్షరాస్యత, 85 శాతం తెల్లకార్డులు, నీరు లేని కోటి ఎకరాల భూమి, ఆవాసాల కోసం 32 లక్షల నిరుపేద కుటుంబాల ఎదురుచూపులు, ప్రభుత్వం నుంచి హక్కుగా దక్కాల్సిన సేవల కోసం దేబిరించాల్సిన పరిస్థితి.. ఇలాంటివన్నీ మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి.

-  అధికారంలోకి వచ్చాక మన గ్రామం, మన వ్యవసాయం, మన బడి, మన నీటిపారుదల రంగం.. ఇలా అన్ని అంశాలపై దృష్టి పెడుతున్నాం. రెండువేల జనాభా ఉన్న గ్రామంలో సచివాలయం.. అందులోనే ప్రతి సేవ. నాలుగడుగులు వెళ్తే నాడు-నేడుతో ఆంగ్ల పాఠశాలలు.. నాలుగడుగులు వే స్తే వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు.. ఇంకో నాలుగడుగులు వేస్తే వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి.

-  సుపరిపాలన దిశగా అడుగులు వేస్తూ మహాయజ్ఞం చేస్తున్నాం. దేవతల యజ్ఞానికే రాక్షసుల పీడ తప్పనప్పుడు.. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎదురుకాకుండా ఉంటాయా? తెలుగునేలపై పుట్టిన కులాల కలుపుమొక్కలు మన పరువు, ప్రతిష్ఠలను బజారుకీడుస్తున్నాయి. వీటిని ఇలాగే వదిలేద్దామా?

-  తనవాడు గెలవలేదన్న కడుపు మంటతో నిత్యం ప్రభుత్వంపై బురదజల్లే టీవీలు, పత్రికలు ఉంటే సమాచార స్వేచ్ఛ అందామా?
Tags:    

Similar News