అమ్మా.. అమ్మా.. నే ప‌సివాడిన‌మ్మా.. నువ్వే లేక వ‌సి వాడాన‌మ్మ‌!

Update: 2022-08-05 05:44 GMT
స‌మాజం మాతృదేవోభ‌వ అని త‌ల్లికి అంద‌రికంటే మొద‌టి స్థానం ఇచ్చింది. బిడ్డ పెంప‌కంలో త‌ల్లిదే ప్ర‌ధాన పాత్ర‌. ఎవ‌రు ఉన్నా లేక‌పోయినా త‌ల్లి స్థానం వేరు. అలాంటి త‌ల్లే లేక‌పోతే ఆ బిడ్డ‌ల‌కు ప్ర‌పంచ‌మంతా త‌ల్ల‌కిందులు అయిపోయిన‌ట్టే. ఎవ‌రు ఉన్నా.. లేక‌పోయినా త‌ల్లి లేక‌పోతే ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం.

అలాంటి ఆ మృత్యువు మ‌న‌సు క‌ర‌గ‌లేదు. ప‌సివాడ‌ని బుగ్గ‌లు, అమాయ‌క‌పు చూపులు, ఇంకా స‌రిగా మాట‌లు కూడా రాని ప‌సిత‌నం, త‌న వాళ్లు ఎవ‌రో, ఎక్క‌డ వారో తెలియ‌దు.. ఎక్క‌డికి వెళ్లాలో తెలియ‌దు. విధి ఆడిని వింత నాట‌కంలో ఆ ప‌సివాడు చిక్కుకుపోయాడు. త‌ల్లి చ‌నిపోయింద‌న్న సంగ‌తి కూడా తెలియ‌ని ఈ చిన్నారి బిక్క‌చూపులు చూస్తున్నాడు.

వివ‌రాల్లోకెళ్తే.. అటు ఇటుగా 35 ఏళ్ల వయ‌సు ఉన్న మహిళ మూడేళ్ల వయసున్న కొడుకును తీసుకుని రైల్లో బీహార్‌లోని భగల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆమెను చూస్తే క‌డుపునిండా అన్నం తిని ఎన్నిరోజుల‌య్యిందో అన్నట్టు ఉంది. పీక్కుపోయిన ముఖం, మాసిన బ‌ట్ట‌లు, ప‌క్కనే మూడేళ్ల పిల్ల‌వాడు, ఆమె ముఖం చూస్తే ఏదో అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంద‌ని ఇట్టే చెప్ప‌వ‌చ్చు.

ఆ భ‌గ‌ల్ పూర్ రైల్వే స్టేషన్‌లో పిల్లాడితో కలిసి కూర్చున్న ఆ కన్న తల్లి కూర్చున్న చోటే కూలబడిపోయింది. ఆ కూర్చునే ఓపిక కూడా లేక పిల్లర్ స్తంభానికి ఆనుకుని పడుకుని ఉండిపోయింది. ఆ దీనావ‌స్థ‌లో ఉన్న అబ‌ల‌ను చూసి మృత్యువు మ‌న‌సు క‌ర‌గ‌లేదు. రైల్వేస్టేష‌న్ లో జ‌నాలు ఎవ‌రి హడావుడిలో వాళ్లు ఉన్నారు. ఇలాంటివి నిత్యం చూస్తూనే ఉంటాం అన్న‌ట్టు వెళ్లిపోతున్నారు. ఆ దీనురాలు ఎవ‌రు, ఏంటి అని ఆరానూ తీయ‌లేదు.

ఎవ‌రూ ప‌ట్టించుకోని.. ఎవ‌రి అండాలేని ఆ దీనురాలిని మృత్యువు క‌నిక‌రించ‌లేదు. ఆమె ప్రాణాలు ద‌క్క‌లేదు. తల్లి చనిపోయిన విషయం కూడా తెలియని ఆ చిన్నారి ఆమె తలపై తలవాల్చి పడుకుండిపోయాడు. ఏం తిన్నాడో, ఎప్పుడు తిన్నాడో పాపం. తల్లి తనువుపై తలవాల్చి ఆకలిని దిగమింగుకుని త‌ల్లి ఆలింగ‌న‌మే త‌న‌కు ముద్దనుకుని ఉండిపోయాడు.

అయితే రైల్వే అధికారులు ఆ పిల్లాడు తల్లిపై పడుకున్న దృశ్యాన్ని చూసి చలించిపోయారు. కానీ.. వాళ్లు ఆమెను గుర్తించే లోపే ఆమె ప్రాణాలు గాల్లో క‌ల‌సిపోయాయి. ఆ పిల్లాడు కూడా మానసికంగా చురుకుగా లేడని వైద్యులు గుర్తించారు. ఈ విషాద ఘటనకు బీహార్‌లోని భగల్‌పూర్ రైల్వే స్టేషన్ మౌన వేదికైంది. ఆ పిల్లాడిని చైల్డ్ కేర్ హోంకు తరలించారు. ఆ మహిళ ఫొటోను, పిల్లాడి ఫొటోను తీసి కుటుంబ సభ్యులు గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో క‌ర‌ప‌త్రాల‌ను పంచిపెట్టారు. 72 గంటల పాటు ఆ మహిళ మృతదేహాన్ని మార్చరీలో ఉంచి ఆమెకు సంబంధించిన వారి కోసం రైల్వే అధికారులు నిరీక్షించారు. ఎవరూ రాకపోవడంతో చివరకు వాళ్లే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. పిల్లాడు త‌న త‌ల్లిపై త‌ల‌వాల్చి ప‌డుకున్న చిత్రం సోష‌ల్ మీడియాను విషాదంలో ముంచెత్తింది.
Tags:    

Similar News