మోత్కుపల్లికి తత్వం బోధపడిపోయింది

Update: 2017-12-25 17:22 GMT
తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు కాస్త ఆలస్యంగానైనా అసలు విషయం అర్థమైనట్లుంది. మూడేళ్లుగా ఆయన ఆశలు పెట్టుకున్న గవర్నరు పదవి ఇక రాదని అర్థమైనట్లుంది. ఇక దాని గురించి ఆలోచించబోనని.. ఆ పదవి గురించి ఆలోచించడం మానేస్తే ఆరోగ్యం బాగుంటుందని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు.
   
నిజానికి రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. మార్పులు చేర్పులు జరిగిన ప్రతిసారీ మోత్కుపల్లి పేరును వార్తల్లోకి తెస్తున్నారు. కానీ, కేంద్రం మాత్రం ఆయన పేరును లిస్టులోకి ఎక్కించడం లేదు. అయితే, చంద్రబాబు మాత్రం పలుమార్లు ఆయనకు హామీ ఇచ్చారు. మోదీకి చెప్పి గవర్నరుగిరీ ఇప్పిస్తానని ఆయన చెబుతూ వచ్చారు. మోత్కుపల్లి కూడా ఆశలు పెంచుకుంటూ వచ్చారు. అయితే.. కేంద్రం, చంద్రబాబు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ఆయనకు అర్థమైనట్లుంది, అందుకే... గవర్నరుగిరీపై ఆశలు వదులుకున్నానని మోత్కుపల్లి అన్నారు.
   
అయితే... తనను గవర్నర్ చేయాలనే ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిదేనని, తనకు ఆ పదవి ఇప్పించేందుకు ఆయన ఎంతో కృషి చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయిందని మోత్కుపల్లి అంటున్నారు. పనిలో పనిగా రేవంత్  రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని నాడు నియమించడం పార్టీ చేసిన చిన్నపొరపాటని, అంతపెద్ద అవకాశం ఆయనకు ఇచ్చి ఉండాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియా హైలైట్ చేయడం వల్లే ఆయనకు అంత గుర్తింపు వచ్చింది తప్పా, ఆయన అసలు నాయకుడే కాదని విమర్శించారు.సామాన్య ప్రజలతో మాట్లాడని వ్యక్తి, ఫోన్ చేస్తే స్పందించని వ్యక్తి నాయకుడెలా అవుతాడని ఎద్దేవా చేశారు. నాడు రేవంత్ వ్యవహారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి పలుసార్లు తీసుకెళ్లానని, అయితే, రేవంత్ పై బాబుకు అప్పట్లో నమ్మకం ఉండటం వల్లే ఆయనకు పెద్ద పదవి దక్కిందని చెప్పుకొచ్చారు. అంతపెద్ద అవకాశం లభిస్తే ఆ పదవిని పార్టీ అభివృద్ధికి కాకుండా, స్వప్రయోజనాలకు వాడుకున్నాడని మోత్కుపల్లి విమర్శల వర్షం కురిపించారు.

Similar News