ఈయనెందుకు ఆత్మహత్య చేసుకోవాలబ్బా ?

Update: 2021-08-30 05:33 GMT
‘దళితబంధు పథకం నూరుశాతం అమలవుతుందని అలా కాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాను’.. ఇది తాజాగా మాజీ మంత్రి, దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు. పైగా ఆత్మహత్య కూడా పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలోనట. ఆత్మహత్య చేసుకోవటానికి యాదిగిరి గుట్టనే మోత్కుపల్లి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో చెప్పలేదు లేండి. అయినా పథకం నూరుశాతం అమలుకాకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఈయనకు ఏమొచ్చిందో అర్ధం కావటంలేదు.

పథకాన్ని తెచ్చింది కేసీయార్. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా సీఎందే. ఎందుకంటే లబ్దిదారుల ఎంపిక, నిధుల కేటాయింపు తదితరాలన్నీ చూసుకోవాల్సింది కేసీయార్ మాత్రమే. పథకం సక్సెస్ అయితే క్రెడిట్ మొత్తం సీఎంకు మాత్రమే దక్కుతుంది. అదే పద్ధతిలో ఫెయిలైతే బాధ్యత మొత్తం కూడా కేసీయార్ దే అవుతుంది. దళిత బంధు పథకానికి కర్త, కర్మ క్రియ మొత్తం కేసీయార్ దే అయినప్పుడు మధ్యలో తాను ఆత్మహత్య చేసుకుంటానని మోత్కుపల్లి ప్రకటించటం ఏమిటో.

ఏ ముహూర్తంలో దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రకటించారో కానీ అప్పటి నుండి రాజకీయాలు చాలా హాటు హాటుగా మారిపోయింది. తెలంగాణ రాజకీయం అంతా ఇపుడు ఈ పథకం చుట్టూనే తిరుగుతోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలవటమే టార్గెట్ గా కేసీఆర్ దళిత బంధు పథకాన్ని పట్టుకొచ్చారని అందరికీ తెలిసిందే. అందుకనే పథకం అమలుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పదే పదే కేసీయార్ ను టార్గెట్ చేస్తున్నారు.

ఎన్నికల కోసం తెచ్చిన పథకాన్ని ఒక్క హుజూరాబాద్ కు మాత్రమే కాదని యావత్ రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పథకం అమలు చేయాలంటే భారీ ఎత్తున నిధులు కావాలి. అంత నిధులు ప్రభుత్వం దగ్గర లేదు. పైగా పథకం అమలుకు లక్ష కోట్ల రూపాయలైనా కేటాయిస్తానని కేసీయార్ ప్రకటించడమే విచిత్రంగా ఉంది. మిగులు బడ్జెట్ తో మొదలైన రాష్ట్రం చివరకు అప్పుల్లో కూరుకుపోయింది. నిధుల కోసం భూములను అమ్ముకుంటున్న ప్రభుత్వం దగ్గర దళిత బంధు పథకం అమలుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసేంత సీన్ ఉందా అనేది ప్రశ్న.
Tags:    

Similar News