సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి.. ఆ టైంలో ఏం జరిగిందంటే?

Update: 2023-02-24 20:05 GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ.. వైసీపీ నేత.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సోదరుడయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ రోజు (శుక్రవారం) హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కోసం వచ్చిన అవినాశ్ తన వెంట న్యాయవాదుల్ని వెంట తెచ్చుకున్నారు. తనను లాయర్ల సమక్షంలో విచారణ జరపాలని ఎంపీ అవినాశ్ కోరటం.. అందుకు సీబీఐ ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది.

శుక్రవారం ఉదయం సీబీఐ కార్యాలయానికి వచ్చిన విచారణ సాయంత్రానికి కూడా కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పలు అంశాల మీద అవినాశ్ ను ప్రశ్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలపైన సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారని.. దస్తగిరి స్టేట్ మెంట్ ను ప్రస్తావిస్తూ అవినాశ్ ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. రూ.40 కోట్ల డీల్ పైనా ప్రశ్నలు వేస్తున్నట్లుగా చెబుతున్నారు.

దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో ఉన్న కాల్ లిస్టుతో పాటు.. నిందితుల టవర్ లొకేషన్ల పైనా సీబీఐ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ బెయిల్ పై జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో.. ఎంపీ అవినాశ్ పై పలు అంశాల్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ ఎదుర విచారణకు హాజరైన అవినాశ్ విచారణ ఉదంతం ఉత్కంఠగా మారిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఎంపీ అవినాశ్ విచారణ నేపథ్యంలో పోలీసులు అలెర్టు అయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఆంక్షల్ని విధించారు. ఇదంతా రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అని.. ప్రత్యేకంగా ఏమీ చేయట్లేదంటున్నారు. ఇక.. సీబీఐ కార్యాలయం వద్దకు కడప జిల్లా నుంచి చేరుకున్న వైసీపీ వర్గీయులను వెనక్కి పంపుతున్నారు. సీబీఐ విచారణ అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News