ఎంపి విషయం స్పీడైందా ?

Update: 2021-06-12 04:30 GMT
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఢిల్లీలో స్పీడైందా ? జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత చాలామందిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే రాజమండ్రి ఎంపి, వైసీపీ విప్ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ ను కలిసి తిరుగుబాటు ఎంపిపై అనర్హత వేటు వేయాలని రిక్వెస్ట్ చేయటమే.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘరామపై అనర్హత వేటు వేయాలని పార్టీ తరపున స్పీకర్ ఓం బిర్లాకు నోటీసిచ్చి దాదాపు ఏడాదైంది. అయితే రఘురామపై అనర్హత వేటు వేయటంలో రాజకీయ కోణమే ఎక్కువుంది కాబట్టి స్పీకర్ తాత్సారం చేస్తున్నారు. ఎంపిపై స్పీకర్ అనర్హత వేటు వేయాలంటే అందుకు నరేంద్రమోడి ఆమోదం అవసరం. సాంకేతికంగా మోడికి సంబంధం లేకపోయినా ప్రస్తుత రాజకీయాల్లో ఏ విషయం కూడా నియమనిబంధనల ప్రకారం జరగటంలేదు కదా.

పార్టీ నుండి ఫిర్యాదు రాగానే గతంలో జనతాదళ్ నేత శరద్ యాదవ్ పై నాలుగు రోజుల్లోనే అనర్హత వేటుపడింది. అదే రఘురామ పై ఫిర్యాదు వచ్చి ఏడాది దాటినా స్పీకర్ పట్టించుకోలేదు. కారణాలేమిటంటే యాదవ్ విషయంలో మోడికి పెద్దగా ఆశక్తిలేదు. అదే రఘురామ విషయానికి వస్తే మోడికేమైనా ఆశక్తి ఉందేమో. అందుకనే చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్ ముహూర్తం చూస్తున్నారు.

అయితే ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను జగన్ కలిసిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటన ముగించుకుని జగన్ అమరావతి చేరుకోగానే పార్టీ విప్ స్పీకర్ ను కలిసి ఎంపిపై అనర్హత వేటుకు విజ్ఞప్తి చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే అమిత్ షా-జగన్ చర్చల్లో రఘురామపై వేటు వేసే విషయం చర్చల్లోకి వచ్చినట్లు అనుకోవాలి. బహుశా అమిత్ సానుకూలంగా స్పందించి స్పీకర్ ను కలిసి లేఖ ఇమ్మని జగన్ కు చెప్పుండాలని వైసీపీలో చర్చ జరుగుతోంది.

కాబట్టే జగన్ ఆదేశాల ప్రకారం భరత్ వెంటనే స్పీకర్ ను కలిసి తాజాగా మరో లేఖ ఇచ్చారు. దీంతోనే ఎంపిపై అనర్హత వేటు విషయంలో పావులు కదులుతున్నాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లోక్ సభ+రాజ్యసభలో మోడి సర్కార్ కు జగన్ భేషరతుగా మద్దతిస్తున్నారు. అనర్హత వేటు విషయంలో జగన్ ఆలోచనలకు వ్యతిరేకంగా నడుచుకోవాల్సిన అవసరం మోడికి లేదు.

ఎందుకంటే వైసీపీ తరపున 28 మంది ఎంపిలు కావాలా ? లేకపోతే తిరుగుబాటు ఎంపి కావాలా అనే పరిస్ధితి వస్తే మోడి కచ్చితంగా 28 మంది ఎంపిలవైపే మొగ్గుతారు. అందుకనే జగన్ ఢిల్లీ టూర్ అయిపోగానే రఘురామపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైందా అనే డౌట్ పెరిగిపోతోంది.


Tags:    

Similar News