ధోని.. సీఈఓ అయిపోయాడు

Update: 2017-04-04 14:01 GMT
‘ఒకే ఒక్క‌డు’ సినిమా చూసిన వాళ్లంద‌రికీ వ‌న్ డే సీఎం కాన్సెప్ట్ గురించి ఐడియా ఉంటుంది. ఇప్పుడు వ‌న్ డే సీఈఓ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఓ ప్ర‌ముఖ సంస్థ‌. భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఒక్క రోజు సీఈవోగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. గ‌ల్ఫ్ ఆయిల్ ఆఫ్ ఇండియా సంస్థ‌లో అత‌ను ఈ బాధ్య‌త‌ల్లో కొన‌సాగాడు. ధోని ఈ సంస్థ‌కు 2011 నుంచి ప్ర‌చార‌క‌ర్త‌గా ఉంటున్నాడు. అత‌డితో సుదీర్ఘ అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని అత‌డికి ఒక్క రోజు సీఈవోగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది సంస్థ యాజ‌మాన్యం. సూటేసుకుని సీఈవోలా త‌యారై వ‌చ్చిన ధోని కోసం నేమ్ బోర్డు కూడా త‌యారు చేయించారు.

సీఈవోగా తాత్కాలిక బాధ్య‌త‌లే చేప‌ట్టిన‌ప్ప‌టికి ఒక సీఈవో లాగే ధోని వ్య‌వ‌హ‌రించాడ‌ని కంపెనీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. బోర్డు ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించ‌డంతో పాటు సీఈవో హోదాలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు కూడా ధోని తీసుకున్న‌ట్లు కంపెనీ తెలిపింది. ఒక కార్పొరేట్ కంపెనీలో వ్య‌వ‌హారాలు ఎలా ఉంటాయో.. సీఈవో బాధ్య‌త‌లు ఎలా ఉంటాయో ధోనికి అవ‌గాహ‌న క‌ల్పించేందుకే ధోనికి ఈ అవ‌కాశం ఇచ్చామ‌ని.. అత‌ను సంతోషంగా ఈ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడ‌ని గ‌ల్ఫ్ ఆయిల్ ఇండియా సంస్థ పేర్కొంది. ఇండియ‌న్ క్రికెట్లో స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత అత్య‌ధిక వాణిజ్య ఒప్పందాలు చేసుకుని.. వంద‌ల కోట్ల ఆదాయం ఆర్జించిన క్రికెట‌ర్ ధోనినే. టెస్టుల‌కు రిటైర్మెంట్ ఇచ్చినా.. వ‌న్డే కెప్టెన్సీ నుంచి కూడా త‌ప్పుకున్నా అత‌డి హ‌వా ఏమీ త‌గ్గ‌లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News