ప‌వ‌న్‌ పై పోటీకి ముద్ర‌గ‌డ సై.. గెలుపు అవ‌కాశం ఎంత‌?

Update: 2023-06-23 12:08 GMT
తాజాగా కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు(ఉద్య‌మం నుంచి తాను త‌ప్పుకొంటున్న‌ట్టు గా రెండేళ్ల కింద‌టే చెప్పారు) ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. తాను మరోసారి పవ‌న్‌ కు రాసిన లేఖ‌ లో గ‌ట్టి స‌వాలే రువ్వారు. కుదిరితే.. కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌ రెడ్డి పై వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాలని.. లేక‌పోతే.. తోక‌ముడిచి న‌ట్టేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఒక‌వేళ అలా చేయకపోతే .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ పై పోటీ చేయాల‌ని కూడా ఆయ‌న స‌వాల్ రువ్వ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా లోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ పోటీ చేయాల‌ని.. తాను స్వ‌యంగా ప‌వ‌న్‌ పై పోటీకి దిగుతాన‌ని ఆయ‌న వ్యాఖ్య‌నించారు. దీనిని కూడా ఇద్ద‌రం స‌వాల్‌ గానే తీసుకుందామ‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌ కు తాను దూరంగా ఉండాల‌ని అనుకున్నాన‌ని.. కానీ, ప‌వ‌న్ వ్య‌వ‌హారంతో తాను ఇప్పుడు మ‌రోసారి ఎన్నిక‌ల గోదా లోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు.

దీంతో ప‌వ‌న్ కు ఆయ‌న గ‌ట్టి స‌వాలే విసిర‌న‌ట్టు అయింది. అంటే.. దీనిని బ‌ట్టి ప‌వ‌న్ క‌నుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే ముద్ర‌గ‌డ ఆయ‌న‌ పై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నార‌నే సంకేతాలు ఇచ్చారు. అయితే.. పిఠాపురం ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ముద్ర‌గ‌డ ఎందుకు అంత బ‌లంగా ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌స్తావించార‌నేది కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీని ని ప‌రిశీలిస్తే.. పిఠాపురం బ‌ల‌మైన కాపు కంచుకోట‌. ఇక్క‌డ కాపు వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. గ‌తంలో ముద్ర గ‌డ ఉద్య‌మం కూడా ఇక్క‌డ నుంచి ప్రారంభించారు.

ఈయ‌న‌కు మ‌ద్ద‌తు దారులు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. దీంతో త‌న గెలుపు త‌థ్య‌మ‌ని ముద్రగ‌డ చెప్పిన‌ట్టే  అయింది. ఇదేస‌మ‌యం లో ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు పోటీ అన్నారు కానీ... ఏ పార్టీ అనేది చెప్ప‌లేదు. అంటే.. ఆయ‌న స్వ‌తంత్రంగా బ‌రిలో నిలుస్తారా?  లేక‌.. వైసీపీ లో చేరి ఆ పార్టీ టికెట్ పై పోటీ చేస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా.. తాజాగా ముద్ర‌గడ చేసిన స‌వాల్ మాత్రం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంద‌నేది  వాస్త‌వం. మరి దీని పై ప‌వ‌న్ ఎలా కామెంట్ చేస్తారో చూడాలి.

Similar News