అంబానీ ఇంటి వ‌ద్ద బాంబు కేసుః స‌చిన్ కారు సీజ్ చేసిన పోలీసులు!

Update: 2021-03-17 05:30 GMT
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం వ‌ద్ద.. పేలుడు ప‌దార్థాల‌తో క‌ల‌క‌లం రేపిన స్కార్పియో కేసు రోజుకో మ‌లుపు తీసుకుంటోంది. ఈ కేసులో స్కార్పియో ఓన‌ర్ మృతిచెంద‌డం, ముంబై పోలీసు అధికారి స‌చిన్ వాజేను ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవ‌డం తెలిసిందే. అయితే.. తాజాగా మ‌రో విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. స‌చిన్ వాజే కారును స్వాధీనం చేసుకొని, ప‌రిశీలించ‌గా.. ఆ స్కార్పియోకు చెందిన ఒరిజిన‌ల్ నెంబ‌ర్ ప్లేట్ అందులో ల‌భ్య‌మైంద‌ట‌.

ఈ మేర‌కు జాతీయ మీడియా ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. దీని ప్ర‌కారం.. స‌చిన్ వాజే వాడుతున్న మెర్సిడిజ్ వాహ‌నం కూడా అత‌ని పేరుమీద‌ట లేద‌ట‌. అంతేకాకుండా.. ఆ కారులో రూ.5 ల‌క్ష‌ల న‌గ‌దుతోపాటు క‌రెన్సీ కౌంటింగ్ మెషీన్, ఇంకా దుస్తులు, పెట్రోల్ కూడా క‌నుగొన్నార‌ట ద‌ర్యాప్తు అధికారులు. అనంత‌రం స‌చిన్ ఇంటికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకుని, కొంద‌రు పోలీసుల స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశార ఎన్ఐఏ అధికారులు.

కాగా.. ఫిబ్ర‌వ‌రి 26న ముఖేష్ నివాసం ‘యాంటిలియా’ ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిలిపి, ఆ వాహనంలో ఒక బ్యాగును కూడా ఉంచిన విష‌యం తెలిసిందే. అందులో.. ‘ముఖేష్ భయ్యా.. నీతా బాబీ.. ఇదొక ట్రైలర్ మాత్రమే’ అని రాసి ఉంచిన లేఖ‌ను క‌నుగొన్న‌ట్టు సమాచారం.

రంగంలోకి దిగిన‌ ఎన్ఐఏ.. పోలీసు అధికారి స‌చిన్ ను అరెస్టు చేసి, ఆయ‌న‌పై 120బీ, 286, 465, 473, 506(2) సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. స్కార్పియో ఓన‌ర్ మ‌న్ సుఖ్ హిరేన్ మృతివెనుక స‌చిన్ వాజే హ‌స్తం ఉంద‌ని మృతుడి భార్య కూడా ఆరోపించిన విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News