అమెరికాను త‌ప్పుదారి ప‌ట్టించిన ఆరోప‌ణ‌ల‌పై సాఫ్ట్‌వేర్ నిపుణుడు అరెస్ట్

Update: 2020-07-25 14:30 GMT
ప్ర‌భుత్వం సౌక‌ర్యం అడ్డ‌దారి తొక్కాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో ఓ సాఫ్ట్ వేర్ నిపుణుడు అరెస్ట‌య్యాడ‌ని స‌మాచారం. ఏకంగా 5.5 మిలియ‌న్ డాల‌ర్ల మేర అమెరికా ప్ర‌భుత్వానికి టోక‌రా వేసేందుకు ప్ర‌య‌త్నించ‌డానికి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. వీటిపై పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నార‌ని సాఫ్ట్‌వేర్ వ‌ర్గాల్లో వార్త కోడైకూస్తోంది. చిన్న తరహా కంపెనీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ప్రయోజనాలు అందిపుచ్చుకునేందుకు అడ్డదారి తొక్కాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీల్లో ముకుంద్‌ మోహన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం బిల్డ్‌డైరెక్ట్‌.కామ్‌ టెక్నాలజీస్‌కు చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడికి రాబిన్‌హుడ్‌ అనే బ్రోకరేజ్‌ సంస్థ ఉంది. ప్ర‌స్తుతం వైర‌స్ వ్యాప్తితో సాఫ్ట్ వేర్ రంగం తీవ్రంగా ప్ర‌భావిత‌మైంది. లాక్‌డౌన్ వ‌ల‌న దెబ్బ‌తిన్న రంగంలో సాఫ్ట్‌వేర్ రంగం కూడా ఉంది. ఈ క్ర‌మంలో ఏర్ప‌డిన ఆర్థిక సంక్షోభం నుంచి చిన్న తరహా సంస్థలను గట్టెక్కించేందుకు అమెరికా ప్ర‌భుత్వం ‘పేచెక్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాం’ అనే స‌దుపాయం క‌ల్పించింది. వాటిని ల‌బ్ధి పొంది భారీగా సొమ్ము చేసుకుందామ‌ని ముకుంద్‌ పథకం రచించాడని తెలిశాయి.

దీనిలో భాగంగా ఆరు షెల్‌ కంపెనీల పేరిట ఎనిమిది రకాల లోన్లకు దరఖాస్తు చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

ఆ కంపెనీలోని ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు గతేడాది దాదాపు 2.3 మిలియన్‌ డాలర్ల మేర ఖర్చు చేశానని ఈ సంద‌ర్భంగా ఆ స‌దుపాయం పొందేందుకు ద‌ర‌ఖాస్తు ప‌త్రంలో పేర్కొన్నాడు. అంత‌గా చెల్లింపులు చేస్తున్న కంపెనీ త‌మ‌ద‌ని చెప్పి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన స‌దుపాయానికి అర్హుడిగా భావించి రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే దీనిపై పోలీసులు విచార‌ణ చేశారు. ఈ క్ర‌మంలో మొత్తం వివ‌రాలు సేక‌రించ‌గా అత‌డు చేసిన త‌ప్పిదం బ‌య‌ట‌ప‌డింది. ఒక కంపెనీ యాజమాన్య హక్కులు ఈ మే నెల‌లో మోహన్‌కు సంక్రమించాయని తేలింది. గ‌తేడాది చెల్లించ‌న‌ట్లు అబ‌ద్ధం చెప్పార‌ని.. అందులో ఒక్క ఉద్యోగి కూడా లేదని తెలిసింది. దీంతో అమెరికాలోని సీటెల్‌లో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతోంది.


Tags:    

Similar News