రెండో రౌండ్ కు ముందే చెప్పేశాడు

Update: 2015-10-13 08:10 GMT
దేశ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ చిత్రమైన మనిషి. ఎప్పుడు ఎలా ఉండాలో? ఎవరితో స్నేహం చేయాలో? మరెవరికి చేయి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు? మిత్రుల్నే కాదు.. ప్రత్యర్థుల్ని సెట్ చేసుకునే విషయంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తుంటారు. మిగిలిన రాజకీయ నాయకుల మాదిరి.. రాజకీయంగా తప్పులు చేయకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు.

బీజేపీ అంటే మండిపడే ఆయన.. దేశంలో వీస్తున్న మోడీ గాలికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకున్న ఆయన.. తాజాగా బీహార్ ఎన్నికల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీజేపీ అండ్ కోకు వ్యతిరేకంగా బీహార్ అధికారపక్షమైన జేడీయూ.. ఆర్జేడీ.. కాంగ్రెస్ లతోకలిసి ములాయం మహాకూటమిలో భాగస్వామిగా మారారు.

అయితే.. స్వల్ప వ్యవధిలోనే మహాకూటమి నుంచి ములాయం బయటకు వచ్చేశారు. కూటమి పక్షాలు ఎంతగా బతిమిలాడినా ఆయన ససేమిరా అన్నారు. అలాంటి ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం బీహార్ తొలి దశ పోలింగ్ ముగిసి.. మిగిలిన నాలుగు దశల పోలింగ్ కు రాజకీయ పక్షాలు సిద్ధం అవుతున్న వేళ.. ఈ ఎన్నికల్లో మహాకూటమి ఓటమిపాలు కావటం ఖాయమని.. బీజేపీ గెలుస్తుందని వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల వేళ.. అది కూడా మొదటి దశ పోలింగ్ పూర్తి అయిన వెంటనే.. తుది ఫలితం గురించి మాట్లాటం.. అది కూడా తాను కొంతకాలం మద్ధతు ఇచ్చిన మహాకూటమికి మహా పరాజయం తప్పదని చెప్పటం ఒక ఎత్తు అయితే.. బీజేపీ గెలవటం ఖాయమని.. బీహార్ లో బీజేపీ గాలి వీస్తుందని వ్యాఖ్యానించటం చూస్తుంటే.. ములాయం ఏదో మాస్టర్ ప్లాన్ వేశారన్న మాట వినిపిస్తోంది.

మహాకూటమి ఏర్పాటు సమయంలో నితీశ్ చెప్పిన మాటలకు.. ఆ తర్వాత చేసిన పనులకు సంబంధం లేదని.. అందుకే తాను మహా కూటమి నుంచి బయటకు వచ్చేసిన ఆయన.. తాజాగా బీహార్లో బీజేపీ విజయం పక్కా అంటూ జోస్యం చెప్పటం మహాకూటమి నేతలకు పెద్ద ఇబ్బందేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News