ప్రతి ఉదయం వినిపించే ఆ గొంతు మూగబోయింది

Update: 2022-01-24 04:47 GMT
యోతిష్య పెద్దగా తెలుగు ప్రజలకు సుపరిచితులు.. పండితులైన ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారు ఆదివారం తుది శ్వాస విడిచారు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తెలుగు ప్రజల భవిష్యత్తును చెప్పే ఆయన.. గతంగా మారిపోయారు.

 ఊపిరి తీసుకునే సమస్య రావటంతో పాటు.. గుండెకు సంబంధించిన సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. హైదరాబాద్ లో కన్నుమూశారు. టీవీ చానళ్లలో వార ఫలాలు చెప్పే రామలింగేశ్వర సిద్దాంతిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన నివాసం ఉంది. ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురి కావటం.. ఆ వెంటనే ఆయన్ను దగ్గర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే.. మార్గమధ్యలోనే రామలింగేశ్వర సిద్దాంతి తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు గుర్తించి.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు. ఈ ఊహించని విషాద వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తీరని వేదనను కలిగిందని చెప్పాలి.

టీవీల్లో ఆయన మాటల్ని వినేందుకు.. ఆయన చెప్పే వార ఫలాల కోసం తెలుగు ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది సినీ.. రాజకీయ.. వ్యాపార ప్రముఖులకు.. దేశ విదేశాల్లో ఉండే తెలుగు వారికి ఆయన జాతకాల్నిచెబుతుంటారు. ఆయనపై అచంచలమైన నమ్మకం ఉంది. గుంటూరు లో పుట్టిన ఆయన.. తర్వాతి కాలంలో హైదరాబాద్ కు రావటం.. భాగ్యనగరిలోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

శ్రీశైలంలో ఆశ్రమాన్ని స్థాపించి.. వేదాల్లో.. పూజా హోమాది క్రతువుల్లో శిక్షణ పొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాల్ని నిర్వహించేవారు. ప్రతిఏడాది ములుగు సిద్ధాంతి అందించే పంచాంగ ఫలితాలకు యూ ట్యూబ్ లో చక్కటి ఆదరణ ఉందన్న విషయం తెలిసిందే. జ్యోతిష్యుడిగా మారటానికి ముందు ఆయన ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా మంచి పేరుంది. సినీ నటులు ఏవీఎస్.. బ్రహ్మానందం లాంటి కళాకారులతో కలిసి వేలాది ప్రదర్శనల్లో పాల్గొన్న ఆయన.. అలసిన శరీరాన్ని శాశ్వితంగా వదిలేసి.. అనంత లోకాలకు వెళ్లిపోయారు. తెలుగు వారికి సుపరిచితమైన గంభీరమైన ఆయన గొంతు ఎప్పటికి లైవ్ లో మాత్రం కనిపించదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News