మోదీ వ్యాఖ్యలతో అర్థరాత్రి ముస్లిం లా బోర్డు భేటీ.. ఎందుకో?

Update: 2023-06-28 14:00 GMT
ట్రిపుల్ తలాక్ రద్దును సమర్థిస్తూ.. కామన్ సివిల్ కోడ్ అవసరాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్ లో చేసిన ప్రసంగం మరోసారి చర్చనీయాంశమైంది. అదే సమావేశంలో మోదీ కుటుంబ పాలన గురించి కూడా మాట్లాడడం.. అందులోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె అవినీతిని గురించి పేర్కొనడంతో మరింత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు నుంచి కశ్మీర్ వరకు మోదీ దేశంలోని కుటుంబ రాజకీయ పార్టీల గురించి ఏకరవు  పెడుతూ పోయారు. అయితే, ట్రిపుల్ తలాక్, కామన్ సివిల్ కోడ్ అంశాలు మరోసారి చర్చలోకి వచ్చే అవకాశం ఉండడంతో ముస్లిం లా బోర్డు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని.. సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఒకే న్యాయం గురించి పేర్కొందని, దేశంలో రెండు న్యాయాలు ఎందుకంటూ మధ్యప్రదేశ్ లో మోదీ ప్రసంగం తర్వాత మంగళవారం అర్థరాత్రి  అఖిల భారత ముస్లిం లా బోర్డు పెద్దలు సమావేశమయ్యారు. ముఖ్యంగా కామన్ సివిల్ కోడ్ అంశంపైనే వీరి భేటీ జరిగిందని సమాచారం.

కామన్ సివిల్ కోడ్ పై లా కమిషన్ ఎదుట తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని వీరు నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలో రాజ్యాంగ నిపుణులు, లాయర్ల అభిప్రాయాలను తీసుకోనున్నట్లుగా సమాచారం.

మూడు గంటల పాటు ముస్లిం పర్సనల్ లా బోర్డు పెద్దలు మూడు గంటల సుదీర్ఘ సమయం ఆన్ లైన్ ద్వారా సమావేశమైనట్లు తెలిసిది. బీజేపీ మేనిఫెస్టోలో ఎప్పటినుంచో కామన్ సివిల్ కోడ్ ఉన్న విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.

మోదీ వ్యాఖ్యల రీత్యా కామన్ సివిల్ కోడ్ న్యాయ పరిశీలనకు ఏమేరకు నిలుస్తుందనేది వారు చర్చించినట్లుగా కథనాలు వచ్చాయి. ఆ క్రమంలో నిపుణులు, న్యాయవాదుల అభిప్రాయాలు తీసుకుని లా కమిషన్ వద్ద సమర్పించాలని నిర్ణయించారు.

ముసాయిదా బిల్లు త్వరలో? కేంద్ర ప్రభుత్వం త్వరలో కామన్ సివిల్ కోడ్ డ్రాఫ్ట్ బిల్లును ప్రవేశపెట్టనుందనే అంచనాల రీత్యా భిన్న వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ కామన్ సివిల్ కోడ్ పై లా కమిషన్ తాజాగా సంప్రదింపులు మొదలుపెట్టింది. గత ఏడాది సెప్టెంబరులో రాజ్యసభలో ఓ ఎంపీ ప్రైవేటు మెంబరు బిల్లును ప్రవేశపెట్టారు. కొత్తగా ప్యానెల్ ను ఏర్పాటు చేయాలని అందులో కోరారు. అయితే, దీనికి ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గతంలోనూ ఇలాగే ప్రైవేటు బిల్లులు రాజ్యసభలో లిస్టయినా.. ఆ తర్వాత అవి ముందుకెళ్లలేదు.

Similar News