మోడీకి లేఖ రాసే దమ్ముందా? సవాలు విసిరిన ముత్తంశెట్టి?

Update: 2021-02-08 10:00 GMT
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు ఫిక్స్ కావటం తెలిసిందే. దీనిపై ఇప్పటికే రచ్చ షురూ అయ్యింది. ఈ అంశంపై ఏపీలోని అధికార.. విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వీరి వైఖరికి భిన్నంగా ఏపీ బీజేపీ నేతలు అడ్డగోలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మే అంశంపై ప్రధాని మోడీకి లేఖ రాశారు. అందులో విలువైన సూచనలు చేశారు.

ఇదిలా ఉంటే.. విపక్ష నేత చంద్రబాబుకు ప్రధానికి లేఖ రాసే దమ్ము కూడా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబుకు నిజంగా స్టీల్ ఫ్లాంట్ ఉద్యోగులపై ప్రేమ ఉంటే.. విశాఖ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలన్న లేఖను ప్రధాని మోడీకి రాయాలన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. ప్రధాని వద్దకు వెళ్లి విశాఖ ఉక్కు అంశంపై మాట్లాడాలన్నారు.

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ ఏపీ మంత్రి ముత్తంశెట్టి డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడనున్నట్లు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే ప్రత్యక్షంగా.. పరోక్షంగా 1.30లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసే తొలి ఎంపీని తానే అవుతానంటూ ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా.. ప్రధానమంత్రి మోడీకి విశాఖ ఉక్కు అంశంపై చంద్రబాబుకు లేఖ రాసే దమ్ము కూడా లేదన్నట్లుగా మంత్రి ముత్తంశెట్టి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షిస్తున్నాయి. మరి.. దీనికి బాబు ఎలా రియాక్టు అవుతారో చూడాలి. నిజమే.. సీఎం జగన్ ఇప్పటికే మోడీకి లేఖ రాసినప్పుడు.. అపర మేధావిగా పేరున్న బాబు ఎందుకని లేఖ రాయనట్లు..?
Tags:    

Similar News