మైహోం రామేశ్వరరావు ఇంటర్వ్యూ ఇవ్వటమా? ఏం చెప్పారు?

Update: 2021-06-06 23:30 GMT
ఆయనో పెద్ద వ్యాపార వేత్త. ఆ మాటకు వస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడన్న మాట చెబుతారు. వారిద్దరి మధ్య ఫోన్ కాల్ దూరమే ఉందంటారు.వాస్తవం మాట ఏమో కానీ.. తెలంగాణలో అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. బలమైన మీడియా సంస్థ సొంతంగా ఉన్న ఆయన.. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. మైంహోం సంస్థల అధినేత మైహోం రామేశ్వరరావు.

తాజాగా ఆయన ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ప్రభుత్వం చేపట్టాల్సిన మార్పుల గురించి ప్రస్తావించటం గమనార్హం. అంతేకాదు.. రియల్ రంగంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ఏకరువు పెట్టిన ఆయన.. కొవిడ్ కారణంగా రియల్ రంగంపై ప్రభావం ఉంటుందని.. కోలుకోవటానికి కొంత సమయం పడుతుందన్నారు.

మొదటి వేవ్ తో పోలిస్తే.. రెండో వేవ్ లో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు.. ప్రాణ నష్టం అధికంగా జరిగిందన్న కీలక వ్యాఖ్య చేశారు. ఉపాధి.. ఉద్యోగ అవకాశాలు దెబ్బ తిన్నాయన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం మరింత విస్తరించాలంటే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై రామేశ్వరరావు నుంచి వచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది.

అతిక్రమణల్ని ఊరుకోకూడదని.. నిర్ణీత స్థలంలో చేపట్టే నిర్మాణ విస్తీర్ణం నిష్పత్తిని పున:సమీక్షించాలన్నారు. హెచ్ఎండీఏను మరింత బలోపేతం చేయాలని.. ఆ సంస్థ పరిధిలోని ఎన్నో ప్రాంతాల్లో గ్రామ పంచాయితీల అనుమతితో నిర్మాణాలు చేస్తున్నారన్నారు. దీని వల్ల పట్టణ ప్రణాళిక దెబ్బ తింటుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. రెరా చట్టాన్ని కట్టుదిట్టటంగా అమలు చేయాలన్నారు. తనకెంతో దగ్గర మిత్రుడైన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఐదారేళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు.. వ్యవసాయ రంగాలపై ఫోకస్ చేశారని.. అదే స్థాయిలో హైదరాబాద్ మహానగరం మీదా ఫోకస్ చేస్తే.. మరింత డెవలప్ మెంట్ జరుగుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

‘‘దిగువ మధ్యతరగతి మొదలు కొని లగ్జరీ హోం వరకు.. ఆఫీసు స్థలం.. షాపింగ్ మాల్స్.. ఎంటర్ టైన్ మెంట్.. ఇలా అన్ని రకాల సదుపాయాలతో ఒక డ్రీం ప్రాజెక్టు చేపట్టాలని ఉంది. ఇందుకు 2వేల ఎకరాల స్థలాన్ని దశల వారీగా నిర్మించాలన్నది ఆలోచన. ఈ డ్రీమ్ సిటీ ప్రణాళికను సిద్ధం చేసే బాధ్యతల్ని ప్రపంచంలోని టాప్ 3 ఆర్కిటెక్టులకు అప్పగించాం. ఆర్నెల్లలో డిజైన్లు రెఢీ అవుతాయి. వచ్చే రెండేళ్లలోపే నిర్మాణాల్ని ప్రారంభిస్తాం’’ అంటూ తన డ్రీం ప్రాజెక్టు గురించి వెల్లడించారు.


Tags:    

Similar News