గెలుస్తార‌ని చెప్పి ఓడితే ప‌రిస్థితేంది కేసీఆర్‌?

Update: 2018-06-25 05:06 GMT
రాజ‌కీయాల్లో జోస్యం చెప్పేట‌ప్పుడు ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాలి. ఏ మాత్రం త‌ప్పు దొర్లినా అందుకు త‌గిన మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది. రాజ‌కీయంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కోవ‌ట‌మే కాదు.. అంచ‌నా వేయ‌టం కూడా రాద‌న్న ముద్ర‌లు ఏ మాత్రం మంచివి కావు. అందుకే.. త‌మ‌కు సంబంధించిన విష‌యాల్నే ప్ర‌స్తావించే అధినేత‌ల తీరుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా వ్య‌వ‌హ‌రించారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ గెలుపు ప‌క్కా అంటూ తేల్చేసిన కేసీఆర్‌.. అక్క‌డితో ఆగ‌కుండా ఇత‌ర రాష్ట్రాల గురించి ప్ర‌స్తావించిన తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దీర్ఘ‌కాలం ముఖ్య‌మంత్రులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారి పేర్ల‌ను ప్ర‌స్తావించ‌టం ద్వారా.. తాను సైతం అదే రీతిలో ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌న్న‌ట్లుగా చెప్పుకోవ‌టం బాగానే ఉన్నా.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆ పోలిక తీసుకురాకుండా ఉండే బాగుండేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

మాజీ మంత్రి.. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత దానం నాగేంద‌ర్ ను పార్టీలోకి చేర్చుకుంటున్న సంద‌ర్భంగా మాట్లాడిన కేసీఆర్‌..  మంచిగా ప‌ని చేసే నాయ‌కుల్ని ప్ర‌జ‌లు ఓడించ‌ర‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఒడిశా.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రుల గురించి ప్ర‌స్తావించారు. మంచిగా ప‌ని చేసే నాయులెవ‌ర్నీ ప్ర‌జ‌లు ఓడించ‌రంటూ ఈ ముగ్గురు ముఖ్య‌మంత్రుల పేర్ల‌ను ప్ర‌స్తావించారు.ఈ ముగ్గురు సీఎంలలో ర‌మ‌ణ్ సింగ్ మిన‌హా మిగిలిన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు సుదీర్ఘ‌కాలంగా ఆ ప‌ద‌విలో ఉన్న వారే. న‌వీన్ పట్నాయక్ 18 ఏళ్లుగా సీఎంగా ప‌ని చేస్తుంటే.. శివ‌రాజ్ సింగ్ చౌహాన్ 13 ఏళ్లుగా ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఈ ముగ్గురిలో ఒడిశా ముఖ్య‌మంత్రి మిన‌హాయిస్తే మిగిలిన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ప్ర‌స్తుతం ప్ర‌తికూల వాతావ‌ర‌ణాన్ని ఎదుర్కొంటున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

త్వ‌ర‌లో జ‌రిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ల‌లో ఈ ఇద్ద‌రు బీజేపీ ముఖ్య‌మంత్రుల‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌న్న విశ్లేష‌ణ‌లు.. అంచ‌నాలు జోరుగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి వేళ‌.. ఈ ఇద్ద‌రు సీఎంల గురించి చెప్పి.. వారికి తిరుగులేద‌న్న‌ట్లుగా చెప్ప‌టం చూసిన‌ప్పుడు.. కేసీఆర్ పోలిక త‌ప్పులో కాలేసిన‌ట్లుగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారిన ముంద‌స్తు కానీ రాకుండా.. షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగిన ప‌క్షంలో.. సార్వ‌త్రికాని కంటే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం ఖాయం. అదే జ‌రిగి.. ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డుతున్న అంచ‌నాలు నిజ‌మై.. రెండు రాష్ట్రాల్లోనూ అధికార‌ప‌క్షం కానీ ఓట‌మిపాలైతే.. కేసీఆర్ విశ్లేష‌ణ మీద న‌మ్మ‌కం త‌గ్గ‌ట‌మే కాదు.. ఆయ‌న జోస్యాలు విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోతాయి. అదే జ‌రిగితే.. ఫీల్ గుడ్ ఫ్యాక్ట‌ర్ తో ప్ర‌తిప‌క్షాల‌కు చుక్క‌లు చూపించాల‌నుకునే కేసీఆర్ ఎత్తులు పార‌వ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అన్ని లెక్క‌లేసుకొని.. ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తెలంగాణ ముఖ్య‌మంత్రి తాజాగా మాత్రం త‌ప్పులో కాలేశారా? అన్న సందేహం రాక మాన‌దు.
Tags:    

Similar News