రాయలసీమలో రాజధాని పెట్టాల్సిందే..అమరావతి రైతులది రియల్ ఎస్టేట్ వ్యాపారం!

Update: 2019-12-25 12:10 GMT
ఆంధప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపుతోంది. అమరావతి నుండి రాజధానిని తరలించబోతున్నారు అన్న విషయం బయటకి రావడంతో ..అమరావతి ప్రాంత ప్రజలు ఏపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం మా భూములని ఇచ్చామని ..ఇప్పుడు మళ్లీ మా భూములు వెనక్కి ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని వాపోతున్నారు.

ఈ సమయంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాయలసీమ నేతలు లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని, అయితే, ‘సీమ’కు న్యాయం జరగాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచన హర్షణీయమని తెలిపారు. గతంలో ఐక్యత కోసం రాజధాని కర్నూలు ప్రాంతాన్ని సీమ ప్రజలు త్యాగం చేశారన్నారు. సీమ ప్రజల త్యాగాలు వృథా కాకూడదన్నారు.  ఈ లేఖపై మైసూరారెడ్డి - గంగుల ప్రతాప్ రెడ్డి - శైలజానాథ్ - చెంగారెడ్డి - మాజీ డీజీపీలు ఆంజనేయరెడ్డి - దినేశ్ రెడ్డి తదితరులు సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా మైసూరా రెడ్డి మాట్లాడుతూ... మాకు న్యాయం జరగాలన్నారు. రాజధాని అయితే రాయలసీమ ప్రాంతంలో  రావాలన్నారు. రాజధాని ఇవ్వకుంటే మా ప్రాంతాన్ని మాకివ్వండి. మాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలి. అమరావతి రైతులు చేసింది త్యాగం కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారమన్నారు. అమరావతి రైతులని తాను వ్యతిరేకించడం లేదని - కానీ రాజధాని విషయంలో రాయలసీమ ప్రజలు చేసింది మాత్రం త్యాగం అని అన్నారు. ఎప్పుడూ మేం మాత్రమే త్యాగం చేయాలా ? అంటూ అయన  ప్రశ్నించారు. ముఖ్యమంత్రి - ప్రతిపక్ష నేత కూడా రాయలసీమ వాసులు కాబట్టి వాళ్లు విజ్ఞతతో ఆలోచించి రాయలసీమపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టం అని - రాజధానిపై ఏపీ కేబినెట్ నిర్ణయం ఏమిటో చెప్పిన తరువాత  భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.


Tags:    

Similar News