సంచలనంగా మారిన మైసూరా ‘జగన్’ కథ

Update: 2016-04-28 06:40 GMT
ప్పార్టీకి రాజీనామా చేసే సమయంలోనూ.. పార్టీ మారే సమయంలో సదరు నేతలు విమర్శలు.. ఆరోపణలు చేయటం మామూలే. వీలైనంతవరకూ అధినేత తీరును తప్పు పడుతూ వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే.. ఇందుకు భిన్నంగా జగన్ గురించి మైసూరారెడ్డి చెప్పిన మాటలు వింటే షాక్ తినాల్సిందే. తనను ట్రాప్ చేసి మరీ పార్టీలోకి చేర్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జగన్ వైఖరిని పలువురు పలు విధాలుగా విమర్శించినా.. ఎంత కుట్రపూరితంగా జగన్ వ్యవహరిస్తారన్న విషయానికి తనకు ఎదురైన ఉదంతమే నిదర్శనమంటూ మైసూరా చెప్పిన మాటలు ఇప్పుడు కొత్త చర్చగా మారాయి.

జగన్ పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆయనకు మైసూరారెడ్డి రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాల్ని ఆయన మాటల్లోనే వింటే బాగుంటుంది. మైసూరా ఆరోపణలు చూస్తే..

= మిమ్మల్ని కలిసిన రోజుకు ముందు.. చాలా రోజుల నంచి మీ దగ్గర నుంచి ఇద్దరు మధ్యవర్తులు (ఆ రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ను తమ భుజస్కంధాలపైనే ఉందనుకొని తిరిగిన వారు. వారికి సైతం ప్రస్తుతం మీరు ఫోన్లో దొరకటమే కష్టమైంది. అందువల్ల వారు మీ దగ్గరకు రావటమే మానేశారు) అప్పట్లో ఇతర పార్టీల నేతల్ని వైఎస్సార్ కాంగ్రెస్ లో చేర్చుకునే దశలో ఉన్నప్పుడు ప్రతిరోజూ మాట్లాడేవారు. ఇప్పుడు మీరు వారిని పట్టించుకోవటం లేదు. ఏరు దాటినంత వరకూ ఏటీ మల్లప్ప.. ఏరు దాటాక బోడి మల్లప్ప అన్నట్లు మీ వైఖరి ఉందని వారిప్పుడు చెబుతున్నారు.

= నేను పార్టీలో చేరక ముందు.. నా గురించి మీరు సదరు మధ్యవర్తులకు రెండు రోజులకోసారి ఫోన్ చేసి నాతో మాట్లాడానా? లేనా? అని అడిగినట్లుగా వారు నాకు చెప్పే వారు. కానీ.. ఈ వయసులో పార్టీలు మారి చెడ్డపేరు తెచ్చుకోవటం ఇష్టం లేదని.. రచనా వ్యాసంగం మీద దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు చెప్పా.

= మీతో బ్రేక్ ఫాస్ట్ కి రమ్మని మీరు ఆహ్వానించినట్లుగా చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ కి వస్తే తప్పేం ఉందని మధ్యవర్తులు మీ ఇంటికి తీసుకొచ్చారు. మీ ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే.. నా ప్రమేయం లేకుండానే పలు సంఘటనలు రెప్పపాటులో జరిగిపోయాయి.  మిమ్మల్ని కలిసినట్లు టీవీల్లో రావటం.. వీటిని ఆధారంగా చేసుకొని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయటం.. వైఎస్సార్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కండువా కప్పేంత వరకూ ఒకదాని వెంట మరొక సంఘటనలు చకచకా జరిగిపోయాయి.

= నా పిల్లలంత వయసు ఉన్న వారు కదా అనే సాఫ్ట్ కార్నర్ తో కొట్టుమిట్టాడి.. తుదకు మానవతా దృక్ఫథంతో సర్దుకొని పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేశా.

= 2012 మే 25న సీబీఐ విచారణకు పిలిపించిన రోజు మీకు కూడా గుర్తుండే ఉండి ఉంటుంది. నా వరకు అది బాగా గుర్తున్న రోజు. కట్ త్రోట్ పాలిటిక్స్ కే మీ దగ్గర విలువ ఉందని ఆ రోజు నేను అనుకోలేదు. అందువల్ల తెలిసో.. తెలియకో వేసిన తప్పటడుగును వెనక్కి తీసుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని అనుకుంటున్నా.

= మానవీయతతో వేసిన అడుగు తప్పటడుగు అయిందని.. మీ రాజకీయాల్లో మానవీయతకు తావు లేదని ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో రుజువైంది. ప్రకాశం.. నెల్లూరు.. రాయలసీమ జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ అభివృద్ధికి రాజకీయ పార్టీల నేతలతో వివిధ కమిటీల నాయకులతో ఓ మహా వేదిక ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి మీరు ఓకే చెప్పి.. మీటింగ్ కు డేట్ ఫిక్స్ అయ్యాక మీరు మనసు మార్చుకొని పార్టీ ఎమ్మెల్యేల్ని సమావేశానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. ఇలా అప్పటికప్పుడు మీ ఇష్టం ప్రకారం నిర్ణయాలు మారుస్తారు.

= మీరు ఎప్పటికప్పుడు మార్చు నిర్ణయాలు అపరిచితుడు సినిమాలోని క్యారెక్టర్ ను తలపిస్తాయి. పార్టీలో ఉండి ప్రాంతానికి కానీ.. పార్టీకి కానీ ఏమీ చేయలేక.. మీరు చేస్తున్న కార్యక్రమాలకు తల ఊపుతూ గోళ్లు గిల్లుకుంటూ కూర్చొనే కన్నా.. పార్టీ నుంచి తప్పుకోవటమే మంచిదని అనుకుంటున్నా. తండ్రీ కొడుకులకు.. భార్య భర్తలకు.. అన్నదమ్ములకు మధ్య తగాదాల సంస్కృతిని మీరు పని గట్టుకొని ప్రోత్సహించటం చూస్తుంటే.. ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదనిపిస్తోంది. నిత్యం డబ్బు.. డబ్బు. మానవీయ కోణాలేవీ మీలో కనిపించట్లేదు.
Tags:    

Similar News