విమ‌ర్శ ప్ల‌స్ అయితే!..వ‌ద్దంటారేంటండీ?

Update: 2019-05-11 17:03 GMT
మెగా బ్ర‌ద‌ర్ నాగేంద్ర‌బాబు... అలియాస్ నాగ‌బాబు వాద‌న చాలా వెరైటీగానే ఉంటుందని చెప్ప‌క త‌ప్ప‌దు. మెగా ఫ్యామిలీపై ఎవ‌రు దాడి చేసినా... క్ష‌ణాల్లో స్పందించేంది నాగ‌బాబే. అన్న మెగాస్టార్ చిరంజీవిపై విమ‌ర్శ అయినా - త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ను విమర్శించినా... నాగ‌బాబు అస్స‌లు జీర్ణించుకోలేరు. మొత్తంగా మెగా ఫ్యామిలీ త‌ర‌ఫున వారియ‌ర్‌ గా నాగ‌బాబు మంచి పాత్ర‌నే పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి త‌మ్ముడి పార్టీ జ‌న‌సేన త‌ర‌ఫున న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసిన దరిమిలా నాగ‌బాబు వాద‌న‌లో ఏదో తేడా కొట్టేసిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. అస‌లు విష‌యాన్ని వ‌దిలేసి కొస‌రు విష‌యాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్న‌ట్లుగా ఆయ‌న వాద‌న కొన‌సాగుతోంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఏపీలో ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగిసిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫుల్ రెస్ట్ లో ఉన్నారు. ఎన్నిక‌ల్లో ఎలాగూ గెలిచే ఛాన్సు లేద‌ని తేలిపోయిన నేప‌థ్యంలో మ‌రోమారు టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే దిశ‌గా ప‌వ‌న్ పావులు క‌దుపుతున్నార‌న్న వార్త‌లు ఇప్పుడు హాట్ డీబేట్లకు కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇదే విష‌యంపై నాగ‌బాబు వ‌ద్ద ప్ర‌స్తావిస్తే... ఆయ‌న దాదాపుగా నేల విడిచి సాము చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తర్వాత ఇక సినిమాలు చేయ‌న‌ని ప‌వ‌న్ ఇది వ‌ర‌కే చెప్పేశారు క‌దా. ఇదే విష‌యాన్ని ఇప్పుడు నాగ‌బాబు కూడా గుర్తు చేశారు. ఆ వెంట‌నే... ఎన్టీఆర్ - జమున - చిరంజీవి లాంటి వాళ్లు రాజకీయ ప్రవేశం తర్వాత కూడా సినిమాలు చేశారని ప్ర‌స్తావించిన నాగ‌బాబు.. వారి మాదిరే పవన్ చేయాలనే రూల్ లేదు కదా? అంటూ త‌న‌దైన వాద‌న‌ను వినిపించారు.

అయినా ఈ డొంక తిరుగుడు య‌వ్యారాన్ని ప‌క్క‌న పెట్టేసి త‌న త‌మ్ముడు సినిమాల్లోకి రార‌నో - వ‌స్తార‌నో చెప్పేస్తే స‌రిపోతుంది క‌దా. అలా కాకుండా ఈ రూల్స్ గ‌ట్రా ఏమిట‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక త‌న త‌మ్ముడు ప‌వ‌న్ పై కొంద‌రు ఇప్ప‌టికీ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నాగ‌బాబు... పవన్ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. ప‌వ‌న్ ను ఎవరైనా డీగ్రేడ్ చేస్తే... దానికి 100 రెట్లు ప‌వ‌న్‌ పైకి లేస్తాడని ఆయన చెప్పారు. పవన్‌ ను విమర్శిస్తే అది త‌మ‌కు ప్ల‌స్సే అవుతుంద‌ని కూడా నాగ‌బాబు వ్యాఖ్యానించారు. మ‌రి ప్ల‌స్ అయ్యే విమ‌ర్శ‌ల‌ను ఎందుకు వ‌ద్దంటున్నారో మాత్రం నాగ‌బాబు చెప్ప‌లేదు. మొత్తంగా నాగ‌బాబు త‌న‌దైన శైలి వాద‌న‌తో అప్ప‌టికే క్లారిటీ లేని విష‌యంపై మ‌రింత గంద‌ర‌గోళం నెల‌కొనేలా చేస్తున్నార‌న్న వాద‌న ఇప్పుడు వినిపిస్తోంది.
Tags:    

Similar News