జెండాకు సెల్యూట్ చేయ‌ని ఆ క‌లెక్ట‌ర్‌

Update: 2017-06-03 05:40 GMT
రూల్స్ కంటే... స‌మాజం గొప్ప‌ది. జ్ఞానం క‌న్నా - విచ‌క్ష‌ణ గొప్ప‌ది. స‌మ‌యం..సంద‌ర్భం.. చుట్టూ ఉన్న ప‌రిస్థితుల్ని చూసుకొని వ్య‌వ‌హ‌రించ‌టమే కామ‌న్ సెన్స్‌. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీధ‌ర్ ఈ రెండింటి బ్యాలెన్స్ మిస్ అయ్యి చిక్కుల్లో ప‌డ్డారు. జాతీయ జెండా ముందు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అంద‌రూ సెల్యూట్ చేస్తారు. కానీ.. నాగ‌ర్ క‌ర్నూల్ క‌లెక్ట‌ర్ మాత్రం జాతీయ జెండాకు సెల్యూట్ చేయ‌రు. ఆయ‌న ప‌క్క‌నున్న ఐపీఎస్ లు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు ఎవ‌రైనా స‌రే సెల్యూట్ చేసినా.. ఆయ‌న మాత్రం అటెన్ష‌న్ లో ఉండిపోతారు. జ‌న‌వ‌రి 26న నిర్వ‌హించిన గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంలోనూ ఆయ‌న ఇదే తీరును ప్ర‌ద‌ర్శించి చ‌ర్చ‌నీయాంశంగా మారారు.

తాజాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కేంద్రంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి జూప‌ల్లితో పాటు.. ఎస్పీ క‌ల్మేశ్వ‌ర్ సింగెన‌వ‌ర్.. నాగ‌ర్ క‌ర్నూల్‌.. అచ్చంపేట ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. జెండా ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా త్రివ‌ర్ణ ప‌తాకానికి అంద‌రూ సెల్యూట్ చేస్తే.. క‌లెక్ట‌ర్ మాత్రం అలా ఉండిపోయారు. ఇదో చ‌ర్చ‌నీయాంశం కావ‌టంపై క‌లెక్ట‌ర్ స్పందిస్తూ తాను చేసింది త‌ప్పు కాద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఐఏఎస్ శిక్ష‌ణా కాలంలో రూల్ బుక్ లో రూల్ ప్ర‌కారం.. క‌లెక్ట‌ర్లు సెల్యూట్ చేయ‌కున్నా ఫ‌ర్లేద‌ని.. అటెన్ష‌న్ లో ఉంటే స‌రిపోతుంద‌ని చెప్పార‌ని.. తాను అదే ఫాలో అవుతున్నాన‌ని చెప్పారు. ఐపీఎస్ లు.. పోలీస్ యూనిఫాంలో ఉన్న పోలీస్ సిబ్బంది సెల్యూట్ చేయాల‌ని.. త్రివిధ ద‌ళాల్లోని వారు సైతం సెల్యూట్ త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సి ఉంటుంద‌ని.. త‌మ‌కు అలాంటి అవ‌స‌రం లేద‌న్నారు.

రూల్ బుక్ లో స‌వాల‌చ్చ ఉంటాయి.. అన్ని ఉన్న‌వి ఉన్న‌ట్లుగా చేసేస్తామా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోటి నుంచి వినిపిస్తుంది. నాగ‌ర్ క‌ర్నూల్ క‌లెక్ట‌ర్ లాంటి వారి వ‌ల్ల వ‌చ్చే ఇబ్బందేమిటంటే.. నిబంధ‌న‌ల ప్ర‌కారం వారు చేసింది త‌ప్పు కాక‌పోవ‌చ్చు. కానీ.. ఆయ‌న్ను ఫాలో అయి.. తెలిసి తెలియ‌క చేసే వారితోనే ఇబ్బంది. గౌర‌వ‌నీయ స్థానంలో ఉన్న వారు.. తాము చేసే ప‌నుల్ని విస్తృత దృష్టితో చూడాలే త‌ప్పించి.. రూల్ బుక్ ను అదే ప‌నిగా ఫాలో కావ‌టం స‌రికాదంటున్నారు. మ‌రి.. ఆ విష‌యం స‌ద‌రు క‌లెక్ట‌ర్ గారికి ఎందుకు అనిపించ‌లేదో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News