ఇమ్రాన్ మైండ్ గేమ్ వేళ‌.. మోడీ మాట‌ల గేమ్ అవ‌స‌ర‌మా?

Update: 2019-03-01 04:27 GMT
ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా తీసుకుంటున్న పాక్ ప్ర‌ధాని నిర్ణ‌యాలు ఆస‌క్తిక‌రంగానే కాదు.. భార‌త్ ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేలా ఉన్నాయి. గ‌తంలో ఏ పాక్ ప్ర‌ధాని వ్య‌వ‌హ‌రించ‌నంత సంయ‌మ‌నాన్ని పాటిస్తూ.. భార‌త్ ను ఇరుకున ప‌డేసేలా ఇమ్రాన్ మైండ్ గేమ్ ఆడుతున్నార‌న‌టంలో సందేహం లేదు. భార‌త్ జ‌రిపిన మెరుపుదాడుల అనంత‌రం తెలివిగా ఉచ్చు విసిరిన పాక్ వ్యూహంలో భార‌త్ ఇరుక్కుంద‌న్న అభిప్రాయం లేక‌పోలేదు.

భార‌త గ‌గ‌నంలోకి పాక్ విమానాలు వ‌చ్చి.. భార‌త ఆయుధ‌గారం మీద దాడులు చేసే ప్ర‌య‌త్నం చేసే క్ర‌మంలో పాక్ విమానాల్ని త‌రిమేలా పాక్ ప్లాన్ చేసిందా? అన్న‌ది ఇప్పుడు అనుమానంగా మారింది. ఎందుకంటే.. భార‌త యుద్ధ విమానాలు త‌మ గ‌గ‌న‌త‌లంలోకి వ‌చ్చేలా ప్లాన్ చేసి.. అందుకు  త‌గ్గ‌ట్లే భార‌త యుద్ధ విమానాల్ని కూల్చ‌టం ద్వారా.. త‌మ పైచేయిని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేసిందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఇదిలా ఉంటే.. త‌మ చేతికి చిక్కిన అభినంద‌న్ వ‌ర్ధ‌న్ ను విడుద‌ల చేస్తామంటూ పార్ల‌మెంటులో ప్ర‌క‌ట‌న చేయ‌టం ద్వారా ఇమ్రాన్ మ‌రో మైండ్ గేమ్ కు తెర తీశారు. ఇలా.. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా అమ‌లు చేస్తున్న వ్యూహాల‌తో ఇమ్రాన్ ముందుకెళుతూ.. త‌న ఆట‌లో భాగ‌స్వామ్యం అయ్యేలా చేస్తున్నారు. త‌న‌కు న‌చ్చినా న‌చ్చ‌కున్నా భార‌త్ చేత తాను కోరిన‌ట్లుగా గేమ్ ఆడిస్తున్న ఇమ్రాన్ తీరు ఇప్పుడు స‌రికొత్త‌గా ఉంద‌ని చెప్పాలి.

భార‌త్ మారింద‌ని.. ఇప్పుడు క‌నిపిస్తుంది న‌యా భార‌త్ అంటూ చేస్తున్న ప్ర‌చారానికి ధీటుగా పాక్ అధికార‌పక్షం సైతం పాక్ మారింద‌ని.. కొత్త పాక్ ను చూపిస్తామంటూ చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. గ‌తానికి భిన్నంగా ఉంద‌న్న అభిప్రాయం ఉంది.  పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ తీరు ఇలా ఉంటే.. ప్ర‌ధాని మోడీ తీరు మ‌రోలా ఉంది. అవ‌స‌రానికి మించిన మోడీ మాట్లాడుతున్నార‌న్న విమ‌ర్శ లేక‌పోలేదు. పాక్ లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై మెరుపుదాడులు చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే రాజ‌స్థాన్ లో జ‌రిగిన ఒక బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న మోడీ.. దేశం సురక్షిత‌మైన చేతుల్లో ఉందంటూ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ్యాఖ్య‌లుగా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

అంతేకాదు.. అభినంద‌న్ వ‌ర్ద‌న్ ను తాము విడుద‌ల చేస్తూ పాక్ పార్ల‌మెంటు నిర్ణ‌యం తీసుకుంటే.. మోడీ మాట‌లు మ‌రోలా ఉన్నాయి. పైలట్ ప్రాజెక్టు ముగిసింద‌ని.. ఇది జ‌స్ట్ ప్రాక్టీసు మాత్ర‌మేన‌ని.. ఇప్పుడు అస‌లు ప‌ని చేయాల్సి ఉంద‌ని చెప్ప‌టం ద్వారా తాను వెన‌క్కి త‌గ్గ‌లేద‌ని.. పాక్ ప‌ని ప‌ట్టే వ‌ర‌కూ వ‌ద‌ల‌న‌న్న సంకేతాల్ని ఇచ్చిన‌ట్లు ఉంది. పాక్ దుర్మార్గం మీద పోరాటం చేయాల్సిందే. కానీ..పాక్ మైండ్ గేమ్ ఆడుతూ త‌మ‌కు యుద్ధం చేయాల‌న్న ఆలోచ‌న లేద‌ని.. శాంతిని కాంక్షిస్తున్నామ‌ని.. ఇరు దేశాల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు కోరుకుంటున్నామ‌న్న క‌ల‌ర్ అంత‌ర్జాతీయ స‌మాజానికి ఇస్తున్న వేళ‌.. మోడీ మౌనంగా ఉండ‌టం మంచిద‌న్న అభిప్రాయం ఉంది.

ఒక‌రు మొక్క నాట‌టం.. మ‌రొక‌రు నీళ్లు పోయ‌డ‌ట‌మ‌నే ప‌ద్ధ‌తికి కాలం చెల్లింద‌ని.. బావిలో క‌ప్ప‌ల్లా బ‌తికే రోజులు పోయాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. గ‌తంలో మాదిరి చూస్తూ ఉండిపోవ‌టాన్ని స‌మ‌ర్థించ‌లేం. మ‌న మీద‌కు వ‌చ్చిన వారి సంగ‌తి చూడాల్సిందే. అయితే.. ఆ క్ర‌మంలో అన‌వ‌స‌ర‌మైన దూకుడు ప‌నికిరాద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మ‌న మాట‌లు.. మ‌న‌కు మాత్ర‌మే కాదు.. మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచం హ‌ర్షించేలా చూసుకోవ‌టం అవ‌స‌రం. లేని ప‌క్షంలో ఈ రోజున పాక్ ఏ రీతిలో అయితే అంత‌ర్జాతీయ స‌మాజం నోట విమ‌ర్శ‌ల‌కు గురి అవుతుందో.. అలాంటి విమ‌ర్శ‌ల్నే మ‌న‌కూ వ‌స్తాయ‌న్నది మ‌ర్చిపోకూడ‌దు. మాట‌ల కంటే మైండ్ గేమ్ మీద మోడీ మాష్టారు దృష్టి పెడితే మంచిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News