అస‌లు చౌకీదార్ స‌మాధానాలు ఎందుకు చెప్పాలి?

Update: 2018-12-15 04:15 GMT
కొద్ది రోజులుగా భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు ర‌ఫెల్ అన్న పేరు ప‌క్కింటి అప్పారావు పేరంత కామ‌న్ అయిపోయింది. మోడీ జ‌మానాకు మ‌చ్చ‌గా మారిన ర‌ఫెల్ డీల్ మీదా వ‌చ‌చిన‌న్ని సందేహాలు అన్ని ఇన్ని కావు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఇంత పెద్ద ఎత్తున రఫెల్ మీద ప‌లువురు మాట్లాడినా.. దానికి సంబంధించిన సందేహాల‌కు స‌మాధానాలు ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌లేదు

ప్ర‌ధాని మోడీ. అంతేనా.. క‌నీసం త‌న మీద వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు రియాక్ట్ అయ్యింది లేదు. అంత పెద్ద మోడీ ప‌ప్పు అన్న బిరుదున్న రాహుల్ ప్ర‌శ్నిస్తే స్పందించాలా? అని కొంద‌రు మోడీ వీరాభిమానులు అడ‌గొచ్చు.

కానీ.. అధికారంలో ఉన్న‌ప్పుడు అంద‌రికి బాధ్య‌త‌గా ఉంటాన‌ని చెబుతుంటారు క‌దా. అందులోకి మోడీ మామూలోడా?  దేశానికి ఇంత‌మంది ప్రధానులైనా.. వారంతా ప్ర‌ధానులుగా ఉన్నారే కానీ.. దేశానికి కాప‌లా కాసే చౌకీదార్ గా ఉన్న‌ది మాత్రం మోడీనే క‌దా?  అలాంటి చౌకీదార్ ను ఏ ప్ర‌శ్న అడిగితే అది చెప్పేస్తాడా?

తాను కాప‌లాగా ఉండే వారికి సంబంధించిన స‌మాచారాన్ని గుట్టుగా దాచి ఉంచ‌ట‌మే త‌న ప్ర‌ధ‌మ క‌ర్త‌వ్యంగా చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంటుంది. ఇందుకు త‌గ్గ‌ట్లే చౌకీదార్ మోడీ.. ర‌ఫెల్ డీల్ గురించి పెద‌వి విప్ప‌టం లేదు. దేవ సంక్షేమం దృష్ట్యా.. గుట్టుగా ఉంచాల్సిన విష‌యాల్ని బాహాటం చేసేసి.. చ‌ర్చ‌లు జ‌రుపుతారా? అంటూ ప‌వ‌ర్ ఫుల్ వాద‌న‌ను తెర మీద‌కు తెచ్చారు.

స‌రే.. అన్ని ర‌హ‌స్యాలు చెప్పొద్దు కానీ..కొన్ని సందేహాల‌కు స‌మాధానం చెప్పి పుణ్యం క‌ట్టుకో మోడీ సాబ్ అని అడిగినా లైట్ తీసుకుంటున్న ప‌రిస్థితి. అరే భ‌య్‌..చౌకీదార్ అంటే మ‌రీ అంత చౌక‌గా క‌నిపిస్తున్నాడా?  దేశానికి ర‌క్ష‌ణ‌గా ఉన్న‌ప్పుడు చానా విష‌యాలు తెలుస్తాయి..అవ‌న్నీ అడిగితేనే చెప్పేస్తామా ఏంటి? అంటూ క్వ‌శ్చ‌న్ వేయ‌టం మోడీలో క‌నిపిస్తుంది.

దేశ ర‌క్ష‌ణ బాధ్య‌త‌ల్ని మోస్తున్న మోడీ.. ఆ విష‌యాన్ని త‌న‌కు తానుగా బ‌య‌ట‌కు చెప్ప‌రు. త‌న అనుచ‌ర‌గ‌ణంతో చెప్పిస్తారు. చౌకీదార్ ప‌ని చేస్తున్న‌ప్పుడు.. ఆ ప‌నే చేయాలి క‌దా? ఏమైనా.. దేశానికి ర‌క్ష‌ణ క‌వ‌చంగా  నిలిచే మోడీ.. ఆ ప‌ని చేస్తారే కానీ.. దానికిసంబంధించిన సందేహాల్ని తీర్చాల‌ని అనుకోరు. చౌకీదార్ కాప‌లా కాయాలే కానీ.. క్వ‌శ్చ‌న్లు అడిగితే చెప్పాల‌న్న రూల్ ఎక్క‌డైనా ఉందా?


Tags:    

Similar News