ధర్నాలతో వైరస్ వ్యాపిస్తే చంద్రబాబు బాధ్యత వహిస్తాడా?

Update: 2020-06-13 08:30 GMT
ఈఎస్ఐ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అచ్చెంనాయుడు శుక్రవారం అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా రాజకీయాలు హాట్ గా మారాయి. దీంతోపాటు జేసీ సోదరులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్ తో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కుట్రపూరితంగా, కక్ష సాధింపం చర్యలకు పాల్పడుతోందని నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ అరెస్ట్ లపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. ఈ అరెస్టులకు నిరసనగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. చంద్రబాబు పిలుపునకు స్పందించి ఆందోళనలు చేస్తే ఆ సమయంలో వైరస్ వ్యాప్తి చెందితే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న సమయంలో చంద్రబాబు నిరసనలు, ధర్నాలు చేయమనడం విస్మయం కలిగిస్తోంది. ఆయన పిలుపు మేరకు శుక్రవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. భారీగా హాజరైన వారంతా వైరస్ ఉందనే విషయం మరిచారు. ఒక్కరూ కూడా మాస్క్ లు ధరించలేదు. శానిటైజర్ వాడలేదు. భౌతిక దూరం అనేది ఎక్కడ పాటించలేదు. సామూహిక కార్యక్రమాలపై నిషేధం ఉందనే విషయం మరచిపోయి వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని నిబంధనలు ఉల్లంఘించారు.

అయితే ఆందోళనల సమయంలో ఎవరికైనా ఒకరికి వైరస్ ఉంటే పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అతడి వలన ఎంతో మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సామూహిక కార్యక్రమాలకు పిలుపునివ్వడం చంద్రబాబుకు తగునా అని ప్రశ్నిస్తున్నారు. వైరస్ ప్రబలితే చంద్రబాబు బాధ్యత వహిస్తాడా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల నాయకుడు, పార్టీ ఇదేనా వ్యవహారించాల్సిన పద్ధతి అని ప్రజలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News