వనమానను బుక్ చేసిన వీడియోలు ఎలా బయటకు వచ్చాయి?

Update: 2022-01-11 04:10 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య.. అనుకోని మలుపులు తిరగటమే కాదు.. ఇప్పటివరకు పలు ఆరోపణలు ఎదుర్కొన్న వనమా రాఘవేంద్రరావు అరెస్టుకు దారి తీసిన రామక్రిష్ణ సెల్ఫీ వీడియో ఎంతటి దుమారానికి కారణమైందన్న సంగతి తెలిసిందే. ఇంతకీ.. సదరు సెల్ఫీ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి? వాటిని ఎవరు బయటపెట్టారు? అసలు రామక్రిష్ణ ఫోన్ ను ఎలా అన్ లాక్ చేయగలిగారు? అన్నది మరో ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు తాజాగా సమాధానాలు లభించాయి.

కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవటానికి ముందు రామక్రిష్ణ తన స్నేహితుడి సహకారం తీసుకున్నారు. ‘సారీ బాస్ నన్ను క్షమించు. నేను ఒక వీడియో చేసి పెట్టాను. నా కార్ డ్యాష్ బోర్డులో ఉంది. నా కార్యక్రమాలన్నీ అయిపోయాక ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి..వీడియో చూసి తర్వాత అందరికీ పంపు. ఫోన్ పాస్ వర్డ్ 7474. నా కారు తాళం బాత్రూం పైన ఉంది. నీకు మాత్రమే చెబుతున్నా.. అంటూ మిత్రుడికి వాయిస్ మెసేజ్ పంపాడు.

తన ఆఖరి మాటలు.. తాము ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసేలాచేయటం కోసం అతను మిత్రుడి సహకారం తీసుకున్నాడు. రామక్రిష్ణ కోరినట్లే.. అతడి కారులోని ఫోన్ ను అన్ లాక్ చేసి.. అందులో ఉన్న వీడియోను షేర్ చేయటంతో.. ఈ మొత్తం ఉదంతం పెను సంచలనంగా మారింది. తాజాగా పోలీసులు సిద్ధం చేసిన ఏడు పేజీల రిమాండ్ నోట్ లో ఈ విషయాల్ని పేర్కొన్నారు. దీన్ని కోర్టుకు సమర్పించారు. అతేకాదు.. రామక్రిష్ణ ఆత్మహత్య ఉదంతంలో తమ దర్యాప్తును న్యాయస్థానానికి పోలీసులు వివరించారు.

తాను.. తన కుటుంబంఆత్మహత్య చేసుకోవటానికి ప్రధాన కారణం వనమా రాఘవతోపాటు.. తన తల్లి సూర్యవతి.. సోదరి కొమ్మిశెట్టి మాధవిలేనని బాధితుడు రామక్రిష్ణ లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య ఉదంతం బయటకు వచ్చినంతనే.. తొలుత పాల్వంచ పట్టణ ఎస్ఐ ఆధ్వర్యంలో.. తర్వాత పాల్వంచ ఏఎస్పీ ఆధ్వర్యంలో కేసు విచారణను ప్రారంభించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యయత్నంలో తీవ్రంగా గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామక్రిష్నకుమార్తె సాయి సాహితి వాంగ్మూలాన్ని జడ్జి సమక్షంలోనమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.

రామక్రిష్ణ బావమరిది ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 302, 307, 306 కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రామక్రిష్ణ స్నేహితుడు ఫోన్ కు వచ్చిన ఆడియో సందేశం ఆధారంగా ఘటనా స్థలానికి వెళ్లి కీలక ఆధారాలు సేకరించామని.. క్లూస్ టీంతో మరిన్ని ఆధారాల్ని సేకరించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

మ్రతుడి కారులో ఒక పేజీ ఆత్మహత్య లేఖ.. మరో ఏడు పేజీలతోకూడిన అప్పుల తాలూకు కాగితాల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 34 నిమిషాల సెల్ఫీ వీడియో ఉన్న ఫోన్ ను రికవరీ చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవ బాదితుడిని బెదిరించినట్లుగా పూర్తి ఆధారాలు అందులో ఉన్నాయని.. రాఘవకు బెయిల్ లభిస్తే తనకున్న రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చే అవకాశం ఉందని.. సాక్ష్యుల ప్రాణాలకూ ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే రిమాండ్ రిపోర్టులో.. రాఘవపై గతంలో నమోదైన పదకొండు కేసుల తాలుకు వివరాల్ని కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం భద్రాచలం సబ్ జైల్లో ఉన్న వనమా రాఘవేంద్రరావును విచారణ నిమిత్తం జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి ముందు రామక్రిష్ణ చేసిన సెల్ఫీ వీడియో ఎలా బయటకు వచ్చిందన్న విషయంపై ఉన్న అన్ని సందేహాలు తీరేలా రిమాండ్ నోట్ లోని అంశాలు ఉన్నాయి.


Tags:    

Similar News