రాఘవ ఆగడాలు తెలిస్తే.. కాలకేయుడు గుర్తుకొస్తాడట!

Update: 2022-01-07 06:30 GMT
ఒక దారుణ ఘటన తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వారిని అయ్యో అనిపించేలా చేస్తే.. రెండు రోజులు గడిచేసరికి.. ఆ దారుణ ఘటన వెనుక ఉన్న ఆరాచకం బయటకు వచ్చింది సెల్ఫీ వీడియోతో. తాను..తన కుటుంబం మొత్తాన్ని బలిపీఠం మీదకు ఎక్కించటానికి కారణం.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఒక ఎమ్మెల్యే సుపుత్రుడు. అతడే.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర. 59 ఏళ్ల వయసులో.. తన వద్దకు వచ్చిన పంచాయితీని పరిష్కరించేందుకు.. భార్యను తన దగ్గరకు పంపించాలన్న ఒత్తిడి తీసుకురావటం.. అలాంటి పని చేయలేక ప్రాణాల్ని తీసుకున్న వైనం ఇప్పుడుఅందరిని కదిలించి వేస్తోంది.

రామక్రిష్ణ.. అతని భార్య.. అతని ఇద్దరు కుమార్తెల ఆత్మహత్యలకు కారణం.. వనమా రాఘవ నుంచి వచ్చిన బెదిరింపులే అన్న విషయాన్ని బాధితుడు సెల్ఫీ వీడియోలో ఆరోపించటం పెను దుమారంగా మారింది. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్లు చెబుతున్న వేళ.. అతడి ఆరాచకాలు ఏ రేంజ్ లో ఉంటాయన్న విషయాన్ని పలువురి నోట బయటకు వస్తున్నాయి. వారు చేస్తున్న ఆరోపణల్ని చూస్తే.. రాజమౌళి సినిమాలోని కాలకేయుడు గుర్తుకు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

తాజా ఉదంతం నేపథ్యంలో వనమా రాఘవేంద్ర ఆరాచకాలకు హద్దుపద్దూ లేకుండా పోయిందని.. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఏ అధికారులు పని చేయాలన్నది అతడే నిర్ణయిస్తాడని.. అతడి ఆశీస్సులు లేకుండా పోలీసులు ఎక్కడా పోస్టింగులు దక్కవన్న మాట స్థానికుల నోటి నుంచి వినిపిస్తోంది. ఈ కారణంతోనే.. అతడెంత ఆరాచకానికి పాల్పడినా.. పోలీసులు నోరు మెదపరని చెబుతున్నారు. వారి ఉదాసీనతే.. తాజాగా నాలుగు ప్రాణాలు పోవటానికి కారణమైందని చెబుతున్నారు. తాజా ఉదంతం నేపథ్యంలో.. వనమా రాఘవేంద్రరావుకు సంబంధించిన పలు ఆరోపణలు బయటకువస్తున్నాయి. అతడి తీరు గురించి తెలిస్తే.. సినిమాల్లో చూపించే విలన్ పాత్రలు ఎన్నో కనిపిస్తాయని చెబుతున్నారు.

తన తండ్రి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి తన నియోజకవర్గ పరిధిలో అధికారుల బదిలీలు.. భూవివాదాలు.. ఆస్తి వ్యవహారాలే కాదు.. చివరకు వ్యక్తిగత వ్యవహారాలు.. కుటుంబ కలహాల్లో కూడా తలదూర్చేవాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా 2006లో రాఘవపై తొలి కేసు నమోదైందని.. దాదాపు దశాబ్దంన్నర ముందు నుంచే అతడి ఆరాచకాలు మొదలైనట్లు చెబుతున్నారు.

అతడిపై ఇప్పటివరకు నమోదైన కేసులు

- 2006లో స్థానిక ఎన్నికల సమయంలో మద్యం.. డబ్బుపంపిణీపై రెండు కేసులు. పోలీసులు ఆపినా పట్టించుకోకుండా వాహనంలో దూసుకెళ్లటం.. ప్రభుత్వఉద్యోగులతో దురుసుగావ్యవహరించటం.

- 2017లో ఒక ధర్నా సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిటించారన్న కేసు

- 2020లో పాల్వంచకు చెందిన జ్యోతి అనే మహిళకు చెందిన భూవివాదంలోజోక్యం చేసుకోవటం.. ఈ సందర్భంగా ఆమెపై అతడి అనుచరులు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ పెద్దది కావటంతో కేసు నమోదు చేశారు.

- 2021 జులైలో పాల్వంచకు చెందిన వడ్డీ వ్యాపారి మలిపెద్ది వెంకటేశ్వర్లు రూ.50 లక్షలచిట్టీ పాడారు. నిర్వాహకుడికి ఇవ్వాల్సిన డబ్బులకు బదులుగా రెండు ప్లాటును రాసిచ్చాడు. అదే స్థలాన్ని మరొకరికి రాసివ్వటం వివాదమైంది. ఈ ఉదంతంలో రాఘవ బెదిరింపులతో బాధితుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసిన ఆరోపణలు ఉన్నాయి. జైలుకు వెళ్లిన వెంకటేశ్వర్లు బయటకొచ్చాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి కారణం వనమా రాఘవనే లేఖ రాశారు.


Tags:    

Similar News