పబ్ లో సీసీ కెమేరాలు.. ప్రైవసీ అనేది వద్దా శ్రీనివాసగౌడ్?

Update: 2022-04-10 04:47 GMT
కొండ నాలుక కోసం ఉన్న నాలుక పోగొట్టుకునే చందంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పే అంశం ఈ కోవకే వస్తుంది. అనగనగా హైదరాబాద్ మహా నగరం. మిగిలిన మెట్రో నగరాల మాదిరే భాగ్యనగరిలోనూ పబ్ లకు కొదవ లేదు. ఉన్న అరవై ఒక్క పబ్బుల్లో ఒక పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్న వైనంపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి.. ఆ గుట్టును రట్టు చేశారు.

పబ్ వెనకున్న గబ్బును బయటపెట్టారు. ఇది జరిగిన వారానికి అంటే శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చప్పున మేల్కొన్నారు. ఆయన ఆదేశాలతో నగరంలోని పబ్ యజమానులతో ఒక భేటీని నిర్వహించారు. ఈ మీటింగ్ కు పబ్ యజమానులు పాల్గొన్నారు. కొందరు తమకు బదులుగా తమ వారిని పంపారు.

ఇదంతా ఓకే అనుకున్నంతనే మంత్రిగారి నోటి నుంచి వచ్చిన మాటలు వింటే షాక్ తినాల్సిందే. పబ్ అన్నదే ఒక పర్సనల్ వ్యవహారం. దానికి వచ్చే వారంతా సంపన్నులు.. సెలబ్రిటీలు.. ఇతరత్రా. పబ్ లోపట జరిగేదంతా ప్రైవేటు కార్యక్రమం. అంటే.. తాగే వాళ్లు తాగుతుంటే.. తినేటోళ్లు తింటుంటారు. తమను తాము మరచి.. ఒత్తిడిని జయించేందుకు డీజే శబ్ధాలకు ఏ మాత్రం తగ్గకుండా చిందులేసి తమను తాము సంతోష పెట్టుకుంటారు. ఇదంతా చూసినప్పుడు పక్కా ప్రైవేటు ప్రోగ్రాం మాదిరే కాదు.. చాలామంది వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది.

అలాంటి చోట సీసీ కెమేరాలు పెట్టటం ఏమిటన్నది ఎంతకూ అర్థం కానిది. పబ్బుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని.. ఒకవేళ అలా చేయని పబ్ లను నెల పాటు తాత్కాలికంగా మూసి వేస్తామంటూ మంత్రి గారు వార్నింగ్ ఇచ్చేశారు. పబ్బుల్లోకి మైనర్లను అనుమతిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయని.. అవి కానీ నిజమని తేలితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. రాడిసన్ బ్లూ హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో అందరూ నేరస్థులు కారని.. అదుపులోకి తీసుకున్న వారంతా డ్రగ్స్ తీసుకున్నారంటూ కొందరు రాజకీయ నేతలు ఆరోపించటం సరికాదంటున్నారు.

ఈ విషయాలన్ని పక్కన పెడితే.. పబ్ లాంటి ఒక ప్రైవేటు ప్లేస్ లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి.. దానికి ఎక్సైజ్ సెంట్రల్ ఆఫీసులో ఒక సెంటర్ ను ఏర్పాటు చేసి.. సీసీ ఫుటేజ్ ను అనుసంధానం చేస్తామని చెబుతున్న మంత్రివారు మరచిపోతున్న విషయాలు చాలానే ఉన్నాయి. పబ్ కు వచ్చిన వారికి సంబంధించిన వ్యక్తిగత వీడియో బయటకువస్తే దాని వల్ల జరిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు. పక్కా వ్యక్తిగత విషయాల్ని పబ్లిక్ డొమైన్ లోకి ఉంచితే.. దాని కారణంగా ఎదురయ్యే సమస్యల్ని ఎవరు పరిష్కరిస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి తనకు తాను కోరుకునే ప్రైవసీ అన్నది.. పబ్బుల్లో ఏర్పాటు చేసే సీసీ కెమేరాలతో పోవటం ఖాయం.

అదే జరిగితే.. పబ్ లకు వచ్చేందుకు ఎవరు ఆసక్తి చూపుతారన్నది మరోప్రశ్న. ఒకవేళ తూతూ మంత్రంగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి.. వాటిని పని చేయకుండా చేస్తే.. వాటి వల్ల ప్రభుత్వం కోరుకుంటున్న లక్ష్యం నెరవేరదు. ఇదంతాచూస్తే.. ఇలాంటి సున్నితమైన అంశాల్ని యధాలాపంగా నిర్ణయాలు తీసుకునే కంటే.. ఏం బాగుంటుంది? ఎలా బాగుంటుందన్న విషయాన్ని కాస్తంత అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అది వదిలేసి.. మనసుకు తోచినట్లుగా పబ్బుల్ ను నిర్వహించాలన్న తీరు ‘అతి’గా మారటమే కాదు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుందన్న విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News