కాంగ్రెస్​కు దెబ్బ మీద దెబ్బ.. మరో కీలకనేత గుడ్ బై..!

Update: 2021-02-21 11:20 GMT
తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఆ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదర్కొంటున్నది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని ఇటీవలే ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రకటించారు. అయితే పార్టీలోని ఓ వర్గం ఆయన పట్ల తీవ్ర విముఖతతో ఉంది అది వేరే విషయం. ఇదిలా ఉంటే కాంగ్రెస్​ సీనియర్​ నేత, కుత్బుల్లాపూర్​ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్​ ఆ పార్టీని వీడబోతున్నట్టు సమాచారం. ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీశైలం గౌడ్​ 2009లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందాడు. ఆ తర్వాత కాంగ్రెస్​లో చేరారు. కుత్బుల్లాపూర్​లో కాంగ్రెస్​ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు.

2014 ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్​ టీడీపీ అభ్యర్థి వివేకానందగౌడ్​ చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కూడా మళ్లీ వివేకానంద్​ ​ చేతిలో ఓడిపోయారు. అయితే 2018లో వివేకానంద్​ టీఆర్​ఎస్​ తరఫున పోటీచేశారు. వరసగా రెండుసార్లు ఓడిపోవడంతో కాంగ్రెస్​ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పరస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. అయితే ఆ పార్టీ మాత్రం పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని నియమించడంతో జాప్యం చేస్తోంది. ఇటీవల రేవంత్​రెడ్డి పేరు బలంగా వినిపించింది. దీంతో కాంగ్రెస్​ సీనియర్లు భగ్గుమన్నారు.

ఇంతకాలం పార్టీకి సేవలుచేసిన మమ్మల్ని కాదని .. కొత్తగా టీడీపీ నుంచి వ్యక్తికి ఎలా పదవి అప్పజెపుతారంటూ సొంతపార్టీలోనే కుంపటి రగిలింది. దీంతో కాంగ్రెస్​ అధిష్ఠానం మెత్తబడింది.ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్టు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి ప్రకటించారు. దీంతో పార్టీలోనూ కొంత నూతనోత్సాహం వచ్చింది. ఈ క్రమంలో కీలకనేత ఆ పార్టీకి గుడ్​బై చెప్పడం గమనార్హం.


Tags:    

Similar News