నా ప‌రువు తీసేశారంటున్న మోడీ

Update: 2018-02-20 07:09 GMT
లిక్క‌ర్ కింగ్‌ - విలాస‌పురుషుడు విజ‌య్ మాల్యా ఎపిసోడ్ గుర్తుండే ఉంటుంది. అనూహ్య‌మైన రీతిలో జ‌ల్సాలు చేసి అదే రీతిలో బ్యాంకుల‌కు కుచ్చుటోపి పెట్టి ఎంచ‌క్కా విదేశాల‌కు చెక్కేసిన‌ ఘ‌నుడు. మాల్యా మ‌హాజాదుత‌నం మీడియాలో రావ‌డంతో ఆయ‌న‌ క‌స్సుమన్నాడు. మీడియాపై విమ‌ర్శ‌లు గుప్పించాడు. అస‌లు త‌న త‌ప్పేం లేద‌ని వాపోయాడు. త‌న ప‌రువు తీశార‌ని గ‌గ్గోలు పెట్టాడు. స‌రిగ్గా అలాంటిదే వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోడీ విష‌యంలో జ‌రిగింది. మాల్యా లాగే బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టిన మోడీ ఇప్పుడు ఆయ‌నలాగే మీడియాపై - బ్యాంక‌ర్ల‌పై మండిప‌డుతున్నాడు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యుత్సాహం వల్లే తమ కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చిందని నీరవ్ మోడీ ఆరోపించారు. పీఎన్‌ బీ స్కామ్ బయటపడక ముందే నీరవ్ మోడీ ఆ బ్యాంక్‌ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పీఎన్‌ బీ వైఖరిని తప్పుపట్టారు. పీఎన్‌ బీ అత్యుత్సాహాం వల్లే తాము రుణాలు తీర్చలేని పరిస్థితి ఏర్పడిందని ఆ లేఖలో నీరవ్ ఆరోపించారు. బ్యాంక్‌ కు తాము బాకీ ఉన్న రుణాల కన్నా ఎక్కువగా లెక్కల్లో చూపించారని నీరవ్ విమర్శించారు. కుంభకోణంతో సంబంధం లేని తమ బంధువులను కూడా ఆ కేసులో ఇరికించారని నీరవ్ తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ కు ఈనెల 15వ తేదీన ఈ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. సుమారు 5000 కోట్లు మేరకు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారన్న నీరవ్‌ పై ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు లెక్కలు మీడియాను ఆకర్షించాయని - దాని వల్ల తమ కంపెనీ ఆపరేషన్స్ మూతపడ్డాయని, దాంతో ఫైర్‌ స్టార్ ఇంటర్నేషనల్ - ఫైర్‌ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ పనులు నిలిచిపోయాయని నీరవ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ కారణంగా తాము తమ రుణాలను తీర్చలేని స్థితికి చేరుకున్నట్లు ఆయన ఆరోపించారు. గడువు కోరినా - బ్యాంకు తొందరపాటు చేసిందని - దాని వల్ల తమ బ్రాండ్ ఇమేజ్ కూడా ధ్వంసమైందన్నారు. బ్యాంకు అధికారులు - ప్రతినిధులతో నీరవ్ చేపట్టిన చర్చల గురించి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.

కాగా, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ అక్రమాలపై ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీలాండరింగ్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. నీరవ్‌ ను అరెస్టు చేసి భారత్‌ కు రప్పించేందుకు వేట ప్రారంభించింది. ఆయనకు సంబంధించిన సంస్థలు - నివాసాల్లో ఐదవ రోజూ సోదాలు కొనసాగించింది. సోమవారం ముంబై - పుణ - ఔరంగాబాద్‌ - థాణ - కోల్‌ కతా - ఢిల్లీ - లక్నో - బెంగళూరు - హైదరాబాద్‌ - సూరత్‌ తదితర నగరాల్లోని 38 చోట్ల తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌ నగరంలో రెండు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. దక్షిణ ముంబైలోని వర్లి ప్రాంతంలో ఉన్న సముద్ర మహల్‌ బంగ్లాకు ఈడీ అధికారుల బృందం చేరుకుని తనిఖీలు నిర్వహించింది. నీరవ్‌ - చోక్సీలకు సంబంధించిన విలువైన వజ్రాలు - బంగారు ఆభరణాలను జప్తు చేసింది. వీటి విలువ సుమారు 22 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో - 5 - 694 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు - బంగారు ఆభరణాలు - ఇతర విలువైన రంగురాళ్లను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద నీరవ్‌ మోడీ - చోక్సీలకు చెందిన దాదాపు రెండు డజన్ల స్థిరాస్తులను సైతం సీజ్‌ చేసింది. ఇప్పటికే నీరవ్‌ మోడీకి సమన్లు జారీచేసిన అధికారులు - అతని బంధువు-  గీతాంజలి జెమ్స్‌ అధినేత మెహుల్‌ చోక్సికి ఈ వారంలో సమన్లు జారీచేసే అవకాశం ఉంది. వీళ్ల ద్దరికి సంబంధించిన అన్ని వ్యక్తిగత - ఆర్థికవ్యవహారాలు - వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్లను సేకరించడంపై దృష్టిసారించారని ఈడీ వర్గాలు వెల్లడించాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట - సమగ్ర ఆధారాల మేరకు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లనున్నారు.

Tags:    

Similar News