హిజాబ్ ఇష్యూను సింపుల్ గా తేల్చేసిన ఆ రాష్ట్ర సీఎం

Update: 2022-02-15 02:03 GMT
గడిచిన కొద్ది రోజులుగా కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారి..అక్కడ క్రియేట్ అవుతున్న ప్రకంపనలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు.. నిరసనలు చోటు చేసుకుంటున్న హిజాబ్ ఉదంతాన్ని సింఫుల్ గా తేల్చేశారు బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.

రాజకీయ దుమారంగా మారిన ఈ సున్నిత అంశాన్ని చాలా తేలిగ్గా కొట్టిపారేసిన ఆయన.. అసలు ఇదో విషయం కాదన్నారు. క్లాస్ రూంలో విద్యార్థినులు హిజాబ్ ను ధరిస్తే దానిపై అసలు కామెంట్ చేయాల్సిన అవసరమేమీ లేదన్నారు.

బిహార్ రాష్ట్రంలో ఇదో ఇష్యూ కాదన్న ఆయన.. తాము ఇలాంటివి అస్సలు పట్టించుకోమన్నారు. తాజాగా నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఈ వివాదం గురించి ఆయన మాట్లాడుతూ.. బిహార్ లో ఇదో అంశమేకాదన్న ఆయన.. ఇదంతా పనికిరాని వ్యవహారంగా పేర్కొన్నారు.

బిహార్ స్కూళ్లల్లో పిల్లలంతా దాదాపు ఒకేలాంటి వస్త్రాల్ని ధరిస్తారని.. ఎవరైనా తలపై ఏదైనా పెట్టుకుంటే దానిపై మాట్లాడాల్సిన అవసరం లేదన్న ఆయన.. అలాంటి వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోమన్నారు.

తమ ప్రభుత్వానికి అందరు సమానమేనని.. అందరి సెంటిమెంట్లను గౌరవిస్తామని చెప్పిన నితీశ్.. హిజాబ్ ఇష్యూను చాలా తేలిగ్గా.. సింపుల్ గా తేల్చేయటం ఆసక్తికరంగా మారింది. హిజాబ్ ధరించిన వచ్చిన విద్యార్థినులను కర్ణాటకలోని ఉడిపికి చెందిన విద్యాసంస్థలో అనుమతించకపోవటంతో పెను దుమారంగా మారటం తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ.. ఒక్కొక్క రాష్ట్రానికి ఈ ఇష్యూ పాకుతున్న వేళ.. బిహార్ ముఖ్యమంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

Tags:    

Similar News