కేసీఆర్‌ కు కేంద్రం ఇచ్చిన తాజా షాక్ ఇది

Update: 2016-12-02 09:52 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఊహించ‌ని షాక్ ఇచ్చింది. కేసీఆర్ మాన‌స పుత్రిక అయిన మిష‌న్ కాక‌తీయ‌కు నిధులు ఇవ్వ‌లేమంటూ చేతులు ఎత్తేసింది. ప్రత్యేక ఆర్థిక సాయం పద్దు కింద చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ కోసం ఉద్దేశించిన‌ మిషన్ కాకతీయకు నిధులివ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే మూడేళ్లలో మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని గుర్తుచేసింది. అయితే ప్రత్యేక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆర్థికసాయం చేయడం సాధ్యం కాదని ఆర్థికశాఖ అభిప్రాయపడిందని జలవనరుల శాఖ సహాయమంత్రి సంజీవ్‌ బాల్యన్ లోక్‌ సభలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మిషన్ కాకతీయ యాక్సెలెరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ) కింద తీసుకురావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు ట్రిపుల్‌ ఆర్ (రిపేర్ - రినోవేషన్ - రిస్టోరేషన్) కింద గతేడాది రూ.44.87 కోట్ల మేర నిధులను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

ఇదిలాఉండగా నోట్లరద్దు తదనంతర పరిణామాలపై అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి ప్రతిష్టంభనను తొలగించాలని టీఆర్ ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ జితేందర్‌ రెడ్డి విజ్ఞఫ్తి చేశారు. లోక్‌ సభలో జీరో అవర్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించడంలేదని, అమలవుతున్న విధానం, తదనంతరం ఏర్పడిన పరిస్థితులపైనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిష్టంభనను తొలగించడానికి మధ్యేమార్గంగా బీజేడీకి చెందిన భర్తృహరి మహతాబ్ వంటివారి ద్వారా ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపి ఏ నిబంధన కింద చర్చ జరపవచ్చో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. జితేందర్‌ రెడ్డి చేసిన సూచనను స్వాగతించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ వెంటనే భర్తృహరి మెహతాబ్ అభిప్రాయాన్ని కోరగా, విపక్ష నేతలతో ఒక సమావేశాన్ని నిర్వహించి చర్చకు గల సాధ్యాసాధ్యాలపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News