బండి సంజయ్ ట్వీట్ లో పదును లేదే?

Update: 2022-07-21 04:45 GMT
మాటలు తూటాల్లా పేలాలు. మాట మాట్లాడితే ప్రత్యర్థి చెంప చెల్లుమనాలి. అచ్చం తెలంగాణ యాసలో తిడితే జనాలు కూడా చప్పట్లు కొట్టాలి. అలాంటి వాగ్ధాటి తెలుగు రాజకీయాల్లో కొందరికే ఉంది. అందులో ముఖ్యులు తెలంగాణ సీఎం కేసీఆర్ కాగా..  ఆ తర్వాత రేవంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సొంతం. వీరి తిట్లు చూస్తుంటే ముచ్చటేస్తుంది.

జనాలు ఈలలు గోలలు చేసేలా చేస్తుంది. కేటీఆర్, హరీష్ సైతం బాగానే ప్రసంగిస్తారు. మంచి వక్తలుగా పేరొందారు. ఏపీ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు, జగన్ లకు ఇలాంటి సమయస్ఫూర్తి వాగ్ధాటి లేదు.

కథలు చెబుతూ, సామెతలు వివరిస్తూ జనాల్ని ఎంటన్ టైన్ చేస్తూ చెప్పాల్సిన విషయాన్ని సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకులు సమకాలీన రాజకీయాల్లో చాలా తక్కువ. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లో ఫైర్ ఉన్నా.. ఆయన మాటల దాడి కేవలం రెచ్చగొట్టడానికి తప్పితే అంత పదును ఉండదన్నది విమర్శకుల మాట..

బండి సంజయ్ ట్వీట్లు కూడా అంత బలంగా పేలడం లేదు. తాజాగా ఆయన ఈ ముఖ్యమంత్రిని ఏమంటారు? అంటూ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.  ప్రజలకు వాగ్ధానాలు ఇచ్చి నిలబెట్టుకోకుండా.. కుటుంబ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసే సీఎంను ఏమంటారు? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎగవేతదారుడు, ఫామ్ హౌస్ దొర, విదేశీ కుట్రల సిద్ధాంతకర్త, రాజవంశ మరియు అవినీతి రాజకీయాలకు ప్రతీక, బీఆర్ఎస్ కోసం ప్లాన్ చేస్తుంటే ప్రజలతో వీఆర్ఎస్ పొందనున్న టీఆర్ఎస్' అని బండి సంజయ్ ఐదు అంశాలను లేవనెత్తి ట్వీట్ చేశారు.

తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం కరెక్టే.. ఆయన సిద్ధాంతాలను ప్రశ్నించడం సరైందే. అయితే వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ఆ భాష, యాసను ప్రయోగిస్తే అవి ఈజీగా చేరుతాయి. అలాంటి పదప్రయోగాలు లేకపోతే సరిగ్గా పేలవు. ఇప్పుడు బండి సంజయ్ ఎంత తీవ్రమైన విమర్శలను చేసినా అవి పేలేలా లేకపోవడంతో జనాల్లోకి వెళ్లడం లేదు. ఇక నైనా బండి ట్వీట్లలో పదును పెంచాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News