జనసేన గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా.. ఏ స్ట్రాటజీ లేదా?

Update: 2019-09-19 09:41 GMT
జనసేన పార్టీ కంటూ ఏదైనా వ్యూహం ఉందా? ఆవిర్భవించి ఇప్పటికే ఆరేళ్లు గడిచిపోయాయి. రెండు  ఎన్నికల సమయాల్లో పవన్ కల్యాణ్ గట్టిగా తిరిగారు - ప్రచారం చేశారు. ఒక ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఆయన పార్టీ కూడా పోటీ చేసింది. అయితే స్వయంగా పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇదీ జనసేన ప్రస్థానం.

ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ జనం ముందుకు వస్తే మళ్లీ చంద్రబాబు నాయుడు భజన చేస్తున్నట్టుగానే ఉంటుంది. జగన్ మీద అకారణమైన ధ్వేషాన్ని చూపిస్తూ పవన్ కల్యాణ్.. చంద్రబాబు నాయుడుకు తొత్తు అనే అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు మీద పవన్ సూటిగా అప్పుడు విమర్శలు చేసి ఉంటే - ఇప్పుడు ఆయన జగన్ మీద చేసే విమర్శలకు విలువ ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తొత్తులా మాట్లాడారు. ఇప్పుడు జగన్ ను మాత్రం వీరలెవల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో పవన్ తీరు  విడ్డూరంగా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక అధినేతే ఇలా ఉంటే..ఆ పార్టీ బలగం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జనసేన కాస్తో కూస్తో ఊసులో ఉన్నది కేవలం సోషల్ మీడియాలో మాత్రమే. అయితే  అక్కడ కూడా ఇప్పుడు ఆ పార్టీకి  ఎదురుదెబ్బలు తప్పడం లేదు.

జనసేనకు సంబంధించిన దాదాపు నాలుగువందల అధికారిక ఖాతాలను  ట్విటర్ బ్లాక్ చేసింది. ఫేక్ ట్వీట్లను పెట్టి.. ట్రెండ్స్ ను క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నంలో జనసేనకు అలా ఎదురుదెబ్బ తగిలింది. ఇక జనసేన వీరాభిమానులు పెట్టే ట్వీట్లు - సోషల్ మీడియా పోస్టులు కూడా ప్రహసనంగా ఉంటున్నాయి.

వాళ్లు చిత్రమైన వాదనలు చేస్తూ ఉంటారు. 'బ్రింగ్ బ్యాక్ జేఎస్ పవన్ కల్యాణ్..' వంటి హ్యాష్ ట్యాగులతో కూడా వారు పోస్టులు పెడుతూ ఉంటారంటే..వారి తీరేమిటో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే జనసేన - పవన్ ఫ్యాన్స్ ను ఇల్లిటరేట్స్ గా సంబోధిస్తూ.. రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్లు ఇది వరకే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జనసేన వీరాభిమానుల పోస్టులను చూస్తే ఎవరికైనా అలాంటి అభిప్రాయాలే కలుగుతాయి. అధినేతే సరిగా ఉంటే.. ఆ పార్టీ బలగానికీ ఒక స్పష్టత - వ్యూహం ఉండేదని..ఆయనే అలా కాబట్టి - ఆ పార్టీ ఫ్యాన్స్ మరింత సిల్లీగా ఉంటారని.. విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

   

Tags:    

Similar News