ఏపీలో తెలుగు బ‌డుల‌కు మంగ‌ళం

Update: 2017-01-05 16:35 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీలోని మున్సిపల్ స్కూళ్లలో తెలుగు మీడియానికి స్వస్తి చెబుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు మీడియాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచే తెలుగు మీడియం రద్దై ఇంగ్లీష్ మీడియం అమలుకానుంది.

ఇదిలాఉండ‌గా...మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుండగా రాష్ట్రంలోని మున్సిపల్‌ పాఠశాలలన్నిటిలోనూ ఇప్పటికిప్పుడు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ జారీ అయిన నంబరు 14 జీవో కలకలం రేపుతోంది. మున్సిపల్‌ పాఠశాలల ఉపాధ్యాయులు - విద్యార్థులు - వారి తల్లిదండ్రులూ అంతా ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా ఆంగ్లమాధ్యమంలోని మారమనడం పట్ల విద్యార్థి - ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడుతున్నారు. తెలుగు మీడియానికి స్వస్తి నేపథ్యంలో రేపు వెలగపూడిలో మున్సిపల్‌శాఖ సెక్రటరీతో ఉపాధ్యాయ సంఘాలు భేటీ కానున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,118 మున్సిపల్‌ పాఠశాలల్లో 2,68,209 మంది విద్యార్థులున్నారు. వాటిలో 11,364 మంది ఉపాధ్యాయులుంటారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించే ఉపాధ్యాయులు కూడా పాఠశాలల్లో లేరు. ఇంతవరకు తెలుగు మాధ్యమంలో కొనసాగుతున్న విద్యార్థులు ఆంగ్లంలో పాఠాలు ఎలా అర్థం చేసుకోగలరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆంగ్ల మాధ్యమ పుస్తకాలూ లేవు. ఇంతవరకు తెలుగులోనే బోధన సాగించిన ఉపాధ్యాయులు ఆంగ్లం లో బోధించాలంటే వారికీ శిక్షణ అవసరమవుతుంది. కానీ ఆ శిక్షణకూ సమయం కూడా ఇవ్వలేదు. జాతీయ విద్యావిధానం - కొఠారి కమిషన్‌ - సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కమిటీ.. ఇలా అన్నీ ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం బలవంతంగా ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని విద్యార్థులు - ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యా సంవత్సరం చివరిలో ఈ జీవో తెచ్చి పెద్ద సమస్యను సృష్టించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 6 నుంచి సమ్మెటీవ్‌ పరీక్షలు-2 ఏ భాషలో నిర్వహించాలో కూడా తెలియని అయోమయ స్థితి ఏర్పడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News