ఆంధ్రజ్యోతి హనీట్రాప్ కథనానికి నోటీసులు!

Update: 2020-08-30 06:10 GMT
మీడియాలో సంచలన కథనాలు కొత్తేం కాదు. అయితే.. అలా పబ్లిష్ అయ్యే కథనాలకు ఆధారాలు ఉన్నాయా? లేవా? అన్నది ప్రశ్న. కొన్ని సందర్భాల్లో ఆధారాలు ఉన్నప్పటికీ.. ప్రచురిస్తే న్యాయపరమైన చిక్కులు చోటు చేసుకునే వీలుంటుంది. ఈ కారణంతోనే గతానికి భిన్నంగా చాలా మీడియా సంస్థలు సంచలనకథనాల జోలికి పెద్దగా వెళ్లటం లేదు. ఇదిలా ఉంటే.. తరచూ ఏదో ఒక సంచలన కథనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆంధ్రజ్యోతి దినపత్రికకు తాజాగా ఏపీలోని పదమూడు మంది కలెక్టర్లు కలిసి మూకుమ్మడిగా లీగల్ నోటీసులు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఆ పత్రికలో హనీట్రాప్ పేరుతో ఒక కథనం అచ్చయింది. ఇందులో ఇద్దరు కలెక్టర్లకు సంబంధించిన కథనం ఉంది. ఒక కలెక్టర్ మంచోడు.. బుద్దిమంతుడే అయినా.. ఒక మహిళను ప్రయోగించారని.. రెండో కథనంలో ఒక కలెక్టర్ కు అమ్మాయిల బలహీనత ఉందని.. అతడి దెబ్బకు పలువురు మహిళలు ఇబ్బంది పెడుతుంటారన్న కథనం అచ్చయింది.

దీనిపై ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్లు కలిసి ఆంధ్రజ్యోతికి నోటీసులు పంపారు. సదరు మీడియా సంస్థ ఎండీ ఆర్కేతో పాటు మరో ముగ్గురిని బాధ్యుల్ని చేస్తూ శనివారం నోటీసులు జారీ చేశారు. ఈ కథనంపై ఏపీ కలెక్టర్లు అంతా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. కలెక్టర్ల మనో ధైర్యాన్ని దెబ్బ తీసేలా..వారిపై దాడి చేసేలా ఈ కథనం ఉందన్నది వారి వాదన.

కరోనా లాంటి విపత్కర సమయంలో సంక్షేమ పథకాల ద్వారా అనేక వర్గాల వారిని ఆదుకున్నట్లుగా తమ నోటీసులో కలెక్టర్లు పేర్కొన్నారు. నిరాధార వార్తా కథనాన్ని ప్రచురించినట్లుగా కలెక్టర్లు ఫైర్ అయ్యారు. దేశానికి ఆదర్శంగా ఏపీ కలెక్టర్ల వ్యవస్థ తయారైందని.. అలాంటి వారిపై కుట్రపూరిత ఆలోచనలతో తప్పుడు కథనాలతో దాడి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి కథనాల్ని చూస్తూ కూర్చుంటే.. కలెక్టర్లు స్వేచ్ఛగా పని చేయలేరని.. అందుకే చట్ట ప్రకారం ముందుకు వెళ్లనున్నట్లుగా కలెక్టర్లు పేర్కొన్నారు. మరి.. దీనిపై ఆంధ్రజ్యోతి స్పందన ఏమిటో చూడాలి.
Tags:    

Similar News